
విశాఖ: ఏపీ రాష్ట్ర వృద్ధిరేటు 8.2 శాతం ఉందని సీఎం చంద్రబాబు అబద్ధాలు చెప్పడం, దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కథనాలు రాయడంపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ రోజు(సోమవారం) మీడియా సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. ‘ ప్రజలను మభ్య పెట్టే విధంగా వార్తలు రాయడం ఏమిటి?. వార్తలు రాయడంలో వాస్తవికత ఉండాలి. కూటమి పాలనలో రాష్ట్ర ఆదాయం 32 శాతం తగ్గింది.
10 నెలల కాలంలో లక్ష 40 వేల కోట్లకు పైగా అప్పు చేశారు. అప్పులు చేసిన రాష్ట్రానికి వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది. ఆదాయం లేకుండా జీడీపీ ఎలా పెరుగుతుంది.తప్పుడు రాతలు వలన ప్రజలకు ఉపయోగం ఏమిటి?, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా?, అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ అన్నారు.. ఇప్పుడు సిక్స్ లేదు సెవెన్ లేదు.
ప్రతి సారి చెవిలో పూలు పెడితే ఎవరు నమ్ముతారు. చెత్త పన్ను తీయడం కాదు. వీధుల్లో టన్నుల్లో ఉన్న చెత్త తీయంచాలి. వచ్చిన ప్రతి పేదవాడికి వైద్యం అందించాలి. ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వలేని రాష్ట్రం వృద్ధిరేటులో రెండో స్థానంలో ఉందట. ప్రతి పేదవాడికి వైద్యం అందించాలన్నది వైఎస్సార్సీపీ విధానం. జగన్ పాలనలో 2.78 కోట్లు ప్రజలకు ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్తలు జిల్లా పేపర్ లో వేస్తున్నారు.చంద్రబాబు తప్పుడు వార్తలను మెయిన్ పేజీలో వేస్తున్నారు. డిప్యూటీ సీఎంపై వివక్ష ఎందుకు చంద్రబాబు? అని ప్రశ్నించారు.
