
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రత వైఫల్యంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత నీళ్లు నమిలారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడిగితే ఎలా అంటూ చిందులు తొక్కారు. ప్రశ్న అడిగే రిపోర్టర్లతో ఆగు ఆగు అంటూ వాగ్వాదానికి దిగారు.
1100 మందితో భారీ భద్రత కల్పిస్తే హెలికాప్టర్ దగ్గరకు ప్రజలు ఎలా దూసుకు వెళ్లారంటూ రిపోర్టర్ ప్రశ్నించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీసులు కాపలా పెట్టాలా అంటూ హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. జనాలు ఎక్కువగా వస్తారని మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా?. లేదా మీ ఇంటిలిజెన్స్ బలహీనంగా ఉందా..?. డ్రోన్ సీసీ కెమెరా వ్యవస్థ అంతా మీ చేతుల్లోనే ఉంది కదా?’’ అంటూ రిపోర్టర్ల ప్రశ్నలు అడుగుతుండగానే సమాధానం చెప్పలేక మధ్యలోనే హోం మంత్రి వెళ్లిపోయారు.
కాగా, శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఓ మాజీ సీఎం వచ్చినప్పుడు పోలీసులు కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం వైఎస్ జగన్ పర్యటనలో అడుగడుగునా భద్రతా లోపాలు కనిపించాయి.
పాపిరెడ్డిపల్లికి వచ్చే రహదారుల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకునేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను పోలీసులు.. జగన్ భద్రత విషయంలో చూపకపోవడం గమనార్హం. హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాదిమంది హెలిప్యాడ్ వద్దకు పోటెత్తారు. జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అక్కడికి చేరుకోగానే జనం తాకిడి అంతకంతకు ఎక్కువైంది. అక్కడ నామమాత్రంగా ఉన్న పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు.
హెలికాప్టర్ చుట్టూ జన సందోహం గుమిగూడటంతో చాలాసేపు జగన్ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అభిమానుల తాకిడితో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దీంతో వీఐపీ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో ఆయన్ను తీసుకెళ్లలేమని పైలెట్లు స్పష్టం చేశారు. కొద్దిసేపటికి హెలికాప్టర్ తిరిగి వెళ్లిపోయింది. జగన్ రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. జగన్ పర్యటనల సమయంలో అరకొర పోలీసు భద్రతపై పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగానే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు.
