
సంగారెడ్డి: తల్లి మందలించడంతో కూతురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్గల్ మండలం సామలపల్లిలో ఆదివారం వెలుగుచూసింది. బేగంపేట ఎస్సై రవికాంత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలం సామలపల్లికి చెందిన చిగుళ్ల నర్సింలు–జయమ్మ దంపతులు తమ కూతురు నవనీత(20)ను ఏడాదిన్నర కిందట మర్పడగ గ్రామానికి చెందిన బోడపట్ల యాదగిరితో వివాహం జరిపించారు.
వివాహం అనంతరం కూతురు తరచూ పుట్టింటికి వస్తుండడంతో తల్లిదండ్రులు పలుమార్లు మందలించారు. శనివారం మరోసారి కూతురు పుట్టింటికి రావడంతో వివాహం జరిగిన తర్వాత భర్త వద్ద ఉండాలని, ఎందుకొచ్చావని తల్లి జయమ్మ మందలించింది. తర్వాత జయమ్మ భర్త నర్సింలు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో లక్ష్మక్కపల్లిలో ని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వారు వెళ్లిన అనంతరం నవనీత జీవితంపై విరక్తితో తల్లిగారి ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఇవి చదవండి: కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. కోపంతో తండ్రి..