
మొక్కలపై అవిశ్రాంత ప్రేమ
ప్రకృతిని సృష్టించిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి
● ఉద్యోగ రీత్యా ఊరు విడిచి వెళ్లినా మళ్లీ సొంత గ్రామానికి
● ఎకరంలో 600 మొక్కలు నాటి ఉద్యానవనం
● సేంద్రియ ఎరువులను ద్రవ రూపంలో అందజేత
● విశ్రాంత జీవనంలో మొక్కల సంరక్షణకు సమయం
హుస్నాబాద్‌రూరల్: నేలల స్వభావంతోనే రైతులు పంటలు సాగు చేస్తారు. తరి నేల వరి సాగుకు యోగ్యమైన భూమి. ఇందులో వరి తప్ప మరో పంట వేయడానికి రైతులు ఆసక్తి చూపరు. అలాంటిది తరి నేలలో ఎకరంలో 600 మొక్కలు నాటి ప్రకృతిని సృష్టించాడు ఆర్‌టీసీ రిటైర్డు ఉద్యోగి బొంపెల్లి రామారావు. వరి పంట వద్దు ప్రకృతి పర్యావరణం ముద్దు అన్నట్లు రకరకాల మొక్కలు సేకరించి నాటి నిత్యం చెట్ల సంరక్షణతోనే రైతు కాలం సాగిపోతుంది. చెట్లు పెంచితే పక్షులు చేరి కిచకిచరాగలు తీస్తే పల్లె ప్రకృతి మురిసి పోవాలని, పర్యావరణంకు హాని కలుగకూడదని రైతు ఆకాంక్షిస్తున్నాడు.
2017లో ఉద్యోగ విరమణ చేశాక..
హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామానికి చెందిన బొంపెల్లి రామారావు 10వ తరగతి పూర్తి చేసి 1980లో ఆర్‌టీసీలో మెకానికల్ ఉద్యోగంలో చేరి 2017లో ఉద్యోగ విరమణ చేశాడు. తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం కావడంతో పంటలు అంటే ప్రాణం, చిన్నప్పటి వ్యవసాయ బావి పరిసరాలు తాటి వనాలు, ఎల్లమ్మ చెరువు నీటి జలాశయంతో తన పంట చేళ్లకు ప్రకృతికి కొత్త అందాలను తెచ్చేవి. ఉద్యోగ రీత్యా ఊరు విడిచి కరీంనగర్‌లోనే స్థిరపడ్డ రామారావు ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించాడు. కుమారుడు ఆమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో స్థిరపడగా కూతురు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. అమ్మానాన్నలు పుట్టిన ఊరిలో ఉండగా ఉద్యోగ విరమణ చేసిన రామారావు ఏడాదిపాటు కరీంనగర్ నుంచి తోటపల్లికి వచ్చి పోయేవాడు. పండ్ల తోటలతో వ్యాపారం చేయాలనే ఆలోచన రైతుకు లేదు పంటల సాగుకు కొత్త పద్ధతులను గ్రామీణ రైతులకు పరిచయం చేయాలనే తపన రామారావుది.
ఎకరంలో 600 మొక్కలు
2019లోనే ఊరికి వచ్చి తన ఆరు ఎకరాల వ్యవసాయ భూమిలో ఎకరంలో 600 మొక్కలు నాటి ఉద్యానవనం చేశాడు. శ్రీగంధము 300, జామ 200, దానిమ్మ, పనస, మామిడి, వాటర్ ఆఫిల్, ఉసిరి, బొప్పాయి 100 రకరకాల చెట్లను నాటించాడు. మరో 3 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటించి ప్రకృతిని సృష్టించాడు. అమ్మానాన్నలు 60 ఏళ్లు వరి పంట సాగు చేస్తే రామారావు పంటను మార్చి మొక్కలను పెంచుతున్నాడు. మరో రెండు ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో వరి సాగు సన్న రకం సాగు చేస్తున్నాడు. మొక్కలకు డ్రిప్ సిస్టం ఏర్పాటు చేసి నీరు అందించడంతో పాటు సేంద్రియ ఎరువులను ద్రవ రూపంలో అందిస్తూ మొక్కలను ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటాడు.
పండ్ల మొక్కల పెంపకం
తన తోటలో వాటర్ ఆఫిల్ , మామిడి, జామ పండ్లు పెద్ద పరిమాణంలో ఉండటంతో మార్కెట్‌లో డిమాండ్ ఉంది. పండ్లు కరీంనగర్ మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తాడు. పంటల పై ఎంత ఆదాయం వచ్చినా వాటిని మొక్కల సంరక్షణకే ఉపయోగిస్తాడు. వాటర్ ఆఫిల్ జామ, మామిడి పండ్లను తోట వద్దకు ఎవరు వచ్చినా లేదనకుండా తెచ్చి ఇస్తాడు. పల్లె రైతులకు నూతన పంటల సాగు పై అవగాహన కల్పిస్తూ వరికి బదులు వాణిజ్య పంటలు సాగు చేయాలని సూచిస్తాడు. వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు అవగాహన కల్పిస్తే కొత్త రకం పంటలను సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తారని భావిస్తున్నాడు.

మొక్కలపై అవిశ్రాంత ప్రేమ

మొక్కలపై అవిశ్రాంత ప్రేమ