చరిత్ర సృష్టించిన అశుతోష్‌.. ఐపీఎల్‌లో భారత తొలి బ్యాటర్‌గా.. | Ashutosh Sharma Creates History Delhi Capitals Become 1st Team In IPL To | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన అశుతోష్‌.. మొదటి జట్టుగా ఢిల్లీ అరుదైన రికార్డు

Published Tue, Mar 25 2025 11:52 AM | Last Updated on Tue, Mar 25 2025 12:48 PM

Ashutosh Sharma Creates History Delhi Capitals Become 1st Team In IPL To

అశుతోష్‌ శర్మ (Photo Courtesy: BCCI/IPL)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)- 2025 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలుపుతో ఆరంభించింది. ల​క్నో సూపర్‌ జెయింట్స్‌తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క వికెట్‌ తేడాతో సంచలన విజయం సాధించింది. ఇందుకు ప్రధానం కారణం ఢిల్లీ లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు.

సుడిగాలి ఇన్నింగ్స్‌
ముఖ్యంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన అశుతోష్‌ శర్మ (Ashutosh Sharma) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. చేజారిందనుకున్న మ్యాచ్‌ ఢిల్లీ సొంతమైంది. 26 ఏళ్ల ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.. కేవలం 31 బంతుల్లోనే 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అశుతోష్‌ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.

ఇక లక్నోతో మ్యాచ్‌ సందర్భంగా సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడిన అశుతోష్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో.. విజయంతమైన లక్ష్య ఛేదనలో ఏడు లేదంటే ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి.. అత్యధిక స్కోరు సాధించిన భారత తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో యూసఫ్‌ పఠాన్‌ రికార్డును అశుతోష్‌ బద్దలు కొట్టాడు.

సెంచూరియన్‌ వేదికగా 2009లో యూసఫ్‌ పఠాన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున బరిలోకి దిగి.. ఢిల్లీపై 62 పరుగులు సాధించి నాడు తన జట్టును గెలిపించుకున్నాడు. ఇక ఈ జాబితాలో ఓవరాల్‌గా డ్వేన్‌ బ్రావో 68 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు.

ఏడు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి లక్ష్య ఛేదనలో జట్టును గెలిపించిన బ్యాటర్లు
👉డ్వేన్‌ బ్రావో- 2018లో ముంబై వేదికగాచెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ముంబై ఇండియన్స్‌పై 68 పరుగులు
👉అశుతోష్‌ శర్మ- 2025లో విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 66 నాటౌట్‌
👉ఆండ్రీ రసెల్‌- 2015లో పుణె వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున పంజాబ్‌ కింగ్స్‌పై 66 పరుగులు
👉యూసఫ్‌ పఠాన్‌- 2009లొ సెంచూరియన్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఢిల్లీపై 62 పరుగులు
👉ప్యాట్‌ కమిన్స్‌- 2022లో పుణె వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ముంబై ఇండియన్స్‌పై 56 పరుగులు

మొదటి జట్టుగా ఢిల్లీ అరుదైన రికార్డు
మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా సరికొత్త రికార్డు సాధించింది. ఐపీఎల్‌ చరిత్రలో ఓ జట్టు తరఫున ఏడు, ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు వందకు పైగా పరుగులు సాధించి.. జట్టును గెలిపించడం ఇదే తొలిసారి. అంతకు ముందు ఈ రికార్డు చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేరిట ఉండేది. 2018లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా చెన్నై లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు 79 పరుగులు చేసి జట్టును గెలిపించారు.

ఏడు లేదా ఆ తర్వాతి స్థానాల్లోని బ్యాటర్లు లక్ష్య ఛేదనలో అత్యధిక పరుగులతో జట్టును గెలిపించిన సందర్భాలు
👉2025- ఢిల్లీ క్యాపిటల్స్‌- లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 113 రన్స్‌
👉2018- చెన్నై సూపర్‌ కింగ్స్‌- ముంబై ఇండియన్స్‌పై 79 పరుగులు.

ఐపీఎల్‌-2025: ఢిల్లీ వర్సెస్‌ లక్నో
👉వేదిక: డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం, విశాఖపట్నం
👉టాస్‌: ఢిల్లీ క్యాపిటల్స్‌.. తొలుత బౌలింగ్‌
👉లక్నో స్కోరు:  209/8 (20)
👉ఢిల్లీ స్కోరు: 211/9 (19.3)
👉ఫలితం: ఒక వికెట్‌ తేడాతో లక్నోపై ఢిల్లీ గెలుపు
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అశుతోష్‌ శర్మ.

 చదవండి: అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్‌: ధోని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement