IPL 2025: గుజరాత్‌ టైటాన్స్‌కు షాక్‌.. అతడు సీజన్‌ మొత్తానికి దూరం | Gujarat Titans Star Glenn Phillips Out Of IPL 2025 Know The Reason | Sakshi
Sakshi News home page

IPL 2025: గుజరాత్‌ టైటాన్స్‌కు షాక్‌.. అతడు సీజన్‌ మొత్తానికి దూరం

Published Sat, Apr 12 2025 11:59 AM | Last Updated on Sat, Apr 12 2025 12:45 PM

Gujarat Titans Star Glenn Phillips Out Of IPL 2025 Know The Reason

Photo Courtesy: BCCI/GT

వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు డైనమిక్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ (Glenn Phillips) ఐపీఎల్‌-2025లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఈ న్యూజిలాండ్‌ క్రికెటర్‌ స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. 

కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో సత్తా చాటిన గ్లెన్‌ ఫిలిఫ్స్‌ మెగా వేలంలోకి రాగా.. గుజరాత్‌ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఇంత వరకు ఈ సీజన్‌లో అతడికి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు.

గాయపడిన ఫిలిప్స్‌
ఈ క్రమంలో గత ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (GT vs SRH)తో మ్యాచ్‌ సందర్భంగా మాత్రం సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు ఫిలిప్స్‌. కానీ దురదృష్టవశాత్తూ అతడు గాయపడ్డాడు. ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో రైజర్స్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ బంతిని పాయింట్‌ వైపు తరలించగా.. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న ఫిలిప్స్‌ బాల్‌ను ఆపబోయి గాయపడ్డాడు.

ఈ క్రమంలో ఫిజియో వచ్చి అతడిని బయటకు తీసుకువెళ్లాడు. అయితే, గజ్జల్లో నొప్పి తీవ్రం కావడంతో సీజన్‌ మొత్తానికి ఫిలిప్స్‌ దూరమయ్యాడు. ఇందుకు సంబంధించి టైటాన్స్‌ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సీజన్‌ మొత్తానికి దూరం
‘‘ఏప్రిల్‌ 6న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ సందర్భంగా గ్లెన్‌ ఫిలిప్స్‌ గాయపడ్డాడు. గజ్జల్లో గాయం కారణంగా అతడు తిరిగి న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. గ్లెన్‌ త్వరగా కోలుకోలుకోవాలని గుజరాత్‌ టైటాన్స్‌ ఆకాంక్షిస్తోంది’’ అని టైటాన్స్‌ యాజమాన్యం పేర్కొంది. 

కాగా 28 ఏళ్ల గ్లెన్‌ ఫిలిఫ్స్‌ ప్రపంచంలోని ఉత్తమ ఫీ ల్డ ర్లలో ఒకడు. తనదైన రోజున లోయర్‌ ఆర్డర్లో బ్యాటింగ్‌తోనూ చెలరేగగలడు. అతడు దూరం కావడం టైటాన్స్‌కు ఓ రకంగా ఎదురుదెబ్బ లాంటిదే.

కాగా రైటార్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌ అయిన గ్లెన్‌ ఫిలిప్స్‌.. కుడిచేతి వాటం బ్యాటర్‌. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 65 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు. క్యాష్‌రిచ్‌ లీగ్‌లో చివరగా 2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున అతడు బరిలోకి దిగాడు.

జోరు మీదున్న గిల్‌ సేన
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2025లో గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. సీజన్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఓడిన శుబ్‌మన్‌ గిల్‌ సేన.. ఆ తర్వాత ఊహించని విధంగా పుంజుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టైటాన్స్‌.. ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్తాన్‌ రాయల్స్‌పై గెలుపొందింది. ఇక శనివారం (ఏప్రిల్‌ 12) నాటి మ్యాచ్‌లో టైటాన్స్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడుతుంది. ఇందుకు లక్నోలోని ఏకనా స్టేడియం వేదిక.

చదవండి: KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? ఇంతకీ మెదడు పనిచేస్తోందా?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement