
Photo Courtesy: BCCI/IPL
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపై రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) స్పందించాడు. డెత్ ఓవర్లలో సరిగ్గా బౌలింగ్ చేయకపోవడమే తన పరాజయానికి ప్రధాన కారణం అని పేర్కొన్నాడు. తమకు శుభారంభం లభించినప్పటికీ దానిని కొనసాగించలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా బుధవారం గుజరాత్- రాజస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది.
సాయి సుదర్శన్ ధనాధన్
అహ్మదాబాద్‌లో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్.. ఆతిథ్య గుజరాత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆరంభంలోనే టైటాన్స్ కెప్టెన్, ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (2) వికెట్ తీసి జోష్ నింపాడు. అయితే, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ ఆ ఆనందాన్ని ఎంతో సేపు నిలవనీయలేదు.
సాయి మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించి.. భారీ స్కోరకు పునాది వేశాడు. అతడికి తోడుగా జోస్ బట్లర్ (25 బంతుల్లో 36), షారుఖ్ ఖాన్ (20 బంతుల్లో 36), రాహుల్ తెవాటియా (12 బంతుల్లో 24 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి గుజరాత్ 217 పరుగులు చేసింది.
రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ రెండేసి వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ (6) వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే వన్‌డౌన్ బ్యాటర్ నితీశ్ రాణా (1) కూడా పెవిలియన్ చేరాడు.
సంజూ, హెట్‌మెయిర్ పోరాటం సరిపోలేదు
ఈ క్రమంలో కెప్టెన్, ఓపెనర్ సంజూ శాంసన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 28 బంతుల్లో 41 పరుగులతో ధాటిగా ఆడుతున్న సమయంలో ప్రసిద్ కృష్ణ సంజూను అవుట్ చేసి రాజస్తాన్‌ను దెబ్బకొట్టాడు.
మిగతా వాళ్లలో రియాన్ పరాగ్ (14 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. ధ్రువ్ జురెల్ (5) పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, షిమ్రన్ హెట్‌మెయిర్ (32 బంతుల్లో 52) మాత్రం కాస్త వేగంగా ఆడి స్కోరును 150 దాటించగలిగాడు.
అయితే, అప్పటికే సమయం దాటిపోయింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లంతా కలిసి కనీసం ఇరవై పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో 19.2 ఓవర్లలో రాజస్తాన్ 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఫలితంగా 58 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ మూడు, రషీద్ ఖాన్, సాయి కిషోర్ రెండేసి వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, కుల్వంత్ ఖెజ్రోలియా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
అనుకున్నది ఒకటి.. మా వాళ్లు చేసింది మరొకటి
ఈ నేపథ్యంలో ఓటమి అనంతం రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగానే ఉంది. జోఫ్రా ఆర్చర్ ఆరంభంలోనే శుబ్‌మన్ గిల్ వికెట్ తీసి శుభారంభం అందించాడు. పవర్ ప్లేలోనే వీలైనన్ని ఎక్కువ వికెట్లు తీయాలన్నది మా ప్లాన్. అయితే, డెత్ ఓవర్లలో మాత్రం అనుకున్న విధంగా రాణించలేకపోయాం.
నిజానికి మేము ప్రిపేర్ అయింది ఒకటి.. అక్కడ అయిందొకటి.. మా ఆలోచనలు ఓ రకంగా ఉంటే... మా బౌలర్లు అమలు చేసింది మరొకటి’’ అని ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో పేర్కొన్నాడు. ఇక లక్ష్య ఛేదనలో తాను, హెట్‌మెయిర్ అవుటైన తర్వాత పరిస్థితి చేయిదాటి పోయిందని.. పొరపాట్లపై సమీక్ష నిర్వహించి.. సరికొత్త ఉత్సాహంతో ముందుకు వస్తామని సంజూ అన్నాడు.
చదవండి: సంజూ శాంసన్‌కు భారీ షాక్!
🔝 of their Game. 🔝 of the Table. 💙#GT roar to the top of the points table with another strong display of cricket 💪
Scorecard ▶ https://t.co/raxxjzYH5F#TATAIPL | #GTvRR | @gujarat_titans pic.twitter.com/ZDRsDqoMAT— IndianPremierLeague (@IPL) April 9, 2025