
Photo Courtesy: BCCI
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఐపీఎల్‌లో కేకేఆర్ ఫ్రాంచైజీకి సొంత మైదానమన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో ఆ జట్టుకు హోం అడ్వాంటేజ్ అన్నదే లేకుండా పోయింది. ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. దీనికి కారణం అక్కడి పిచ్ అని కేకేఆర్ సారధి అజింక్య రహానే బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పిచ్‌ను స్పిన్‌కు అనుకూలంగా మార్చమని ఈడెన్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీని ఎన్ని సార్లు అడిగినా పట్టించుకోవడం లేదని అన్నాడు.
తాజాగా ఈడెన్‌లో కేకేఆర్ లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమికి కూడా పిచ్చే కారణమని రహానే సహా కేకేఆర్ యాజమాన్యం భావిస్తుంది. ఈ ఓటమి తర్వాత కేకేఆర్‌కు చెందిన ఓ కీలక అధికారి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) సభ్యులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పిచ్‌పై తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా సదరు కేకేఆర్ అధికారి ఓ క్యాబ్ సభ్యుడితో వ్యంగ్యంగా చర్చించినట్లు తెలుస్తుంది.
ముదురుతున్న వివాదం
బెంగాలీ వార్తా పత్రిక సంగ్బాద్ ప్రతిదిన్ నివేదిక ప్రకారం.. ఈడెన్ పిచ్‌పై క్యూరేటర్ సుజన్ ముఖర్జీ, కేకేఆర్ యాజమాన్యం మధ్య వివాదం ముదురుతున్నట్లు తెలుస్తుంది. లక్నో చేతిలో ఓటమి అనంతరం ఓ కేకేఆర్ అధికారి ఈడెన్ పిచ్ క్యూరేటర్‌ను ఉద్దేశిస్తూ.. అతడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇవ్వాల్సిందని వ్యంగ్యంగా అన్నట్లు సమాచారం.
లక్నోతో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సారధి రహానే కూడా క్యూరేటర్ సుజన్ ముఖర్జీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే వివాదం పెద్దమవడం ఇష్టం లేక వదిలిపెట్టినట్లున్నాడు. సుజన్ ఇదివరకే మీడియా ప్రచారం పొందారని రహానే ఆ సందర్భంగా అన్నాడు.
పిచ్ విషయాన్ని పక్కన పెడితే.. ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడింట ఓడి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. కేకేఆర్ ఓడిన మూడు మ్యాచ్‌లు హోం గ్రౌండ్ ఈడెన్‌లో ఓడినవే కావడం విశేషం. కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌లో రేపు (ఏప్రిల్ 11) సీఎస్‌కేను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగనుంది.
సీఎస్‌కేతో మ్యాచ్‌కు కేకేఆర్ జట్టు (అంచనా)..
డికాక్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రమణ్‌దీప్ సింగ్, రఘువంశీ, రసెల్, రింకూ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సన్ జాన్సన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి