ఐపీఎల్‌లో తొలి ‘డబుల్‌ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని | IPL 2025: MS Dhoni Completes 200 Dismissals In IPL With Terrific Glovework Vs LSG | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో తొలి ‘డబుల్‌ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని

Published Tue, Apr 15 2025 11:50 AM | Last Updated on Tue, Apr 15 2025 12:06 PM

IPL 2025: MS Dhoni Completes 200 Dismissals In IPL With Terrific Glovework Vs LSG

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మరో చారిత్రక మైలురాయిని అందుకున్నాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 200 డిస్మిసల్స్‌ను (క్యాచ్‌లు లేదా స్టంపింగ్స్‌) పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా (ఫీల్డర్‌ లేదా వికెట్‌ కీపర్‌) చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్‌ 14) లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆయుశ్‌ బదోనిని స్టంపౌట్‌ (రవీంద్ర జడేజా బౌలింగ్‌లో) చేయడంతో ఈ ఘనత సాధించాడు. 

ఈ మ్యాచ్‌లో ధోని మరో ఇద్దరిని ఔట్‌ చేయడంలో కూడా భాగమయ్యాడు. పతిరణ బౌలింగ్‌లో వైడ్‌బాల్‌ను కలెక్ట్‌ చేసుకుని అద్భుతమైన డైరెక్ట్‌ త్రోతో (నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌) అబ్దుల్‌ సమద్‌ను రనౌట్‌ చేసి.. ఆ మరుసటి బంతికే లక్నో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ క్యాచ్‌ అందుకున్నాడు. పంత్‌ క్యాచ్‌తో ఐపీఎల్‌లో ధోని డిస్మిసల్స్‌ సంఖ్య 201కి చేరింది. ధోని తన 270వ ఇన్నింగ్స్‌లో డిస్మిసల్స్‌ డబుల్‌ సెంచరీని పూర్తి చేశాడు.

ఐపీఎల్‌లో అత్యధిక డిస్మిసల్స్‌లో భాగమైన ఆటగాళ్లు (ఫీల్డర్‌ లేదా వికెట్‌ కీపర్‌)
201* - ఎంఎస్‌ ధోని (155 క్యాచ్‌లు, 46 స్టంపింగ్‌లు)
182 - దినేష్ కార్తీక్
126 - ఏబీ డివిలియర్స్
124 - రాబిన్ ఉతప్ప
118 - వృద్ధిమాన్ సాహా
116 - విరాట్ కోహ్లీ

లక్నో మ్యాచ్‌లో తొలుత అద్భుతమైన వికెట్‌కీపింగ్‌తో అదరగొట్టిన ధోని ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. 11 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 26 పరుగులు చేసి సీఎస్‌కే గెలుపులో ‍ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా (3-0-24-2), పతిరణ (4-0-45-2), నూర్‌ అహ్మద్‌ (4-0-13-0), ఖలీల్‌ అహ్మద్‌ (4-0-38-1), అన్షుల్‌ కంబోజ్‌ (3-0-20-1) రాణించడంతో నామమాత్రపు స్కోర్‌కే (166/7) పరిమితమైంది.

లక్నో ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మిచెల్‌ మార్ష్‌ (30), ఆయుశ్‌ బదోని (22), అబ్దుల్‌ సమద్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న పూరన్‌ (8), మార్క్రమ్‌ (6) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు.

అనంతరం 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్‌కే.. తొలి 15 ఓవర్ల వరకు (115/5) పరాజయం దిశగా సాగింది. ధోని రాకతో సీఎస్‌కేలో గెలుపు జోష్‌ వచ్చింది. ధోని వచ్చీ రాగానే ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అప్పటివరకు నిదానంగా ఆడిన శివమ్‌ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధోని అండతో గేర్‌ మార్చాడు. వీరిద్దరు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి 3 బంతులు మిగిలుండగానే సీఎస్‌కేను విజయతీరాలకు చేర్చారు.

సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు షేక్‌ రషీద్‌ (27), రచిన్‌ రవీంద్ర (37) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రాహుల్‌ త్రిపాఠి (9), రవీంద్ర జడేజా (7), విజయ్‌ శంకర్‌ (9) నిరాశపరిచారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీ (4-0-23-1), రవి బిష్ణోయ్‌ (3-0-18-2), మార్క్రమ్‌ (4-0-25-1) అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. శార్దూల్‌ ఠాకూర్‌, ఆకాశ్‌దీప్‌, ఆవేశ్‌ ఖాన్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement