
Photo Courtesy: BCCI
ఐపీఎల్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ జోరుకు అడ్డుకట్ట పడింది. వరుసగా 8 మ్యాచ్‌ల్లో విజయఢంకా మోగించిన అతను.. తొమ్మిదో మ్యాచ్‌లో ఓటమి చవి చూశాడు. ఈ క్రమంలో అత్యంత అరుదైన ట్రిపుల్ హ్యాట్రిక్‌ను (వరుసగా 9 మ్యాచ్‌ల్లో విజయం) మిస్ అయ్యాడు. 2024 సీజన్‌లో మొదలైన శ్రేయస్ జైత్రయాత్ర (కేకేఆర్ కెప్టెన్‌గా).. ఈ సీజన్‌లో నిన్నటి మ్యాచ్‌తో ముగిసింది.
ఈ సీజన్‌లో పంజాబ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో జట్టును విజయవంతంగా నడిపించాడు. నిన్న (ఏప్రిల్ 5) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను సీజన్ తొలి ఓటమి పలకరించింది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ తొలుత బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని.. ఆతర్వాత బ్యాటింగ్‌లో చేతులెత్తేసింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్.. రాయల్స్‌ను 205 పరుగుల భారీ స్కోర్ చేయనిచ్చింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో తడబడి 155 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా రాయల్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో రాయల్స్‌కు రెండు వరుస పరాజయాల తర్వాత ఇది వరుసగా రెండో విజయం.
రాయల్స్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (45 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (26 బంతుల్లో 38; 6 ఫోర్లు), రియాన్ పరాగ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటగా.. నేహల్ వధేరా (41 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) పంజాబ్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఛేదనలో రాయల్స్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్ (4-0-25-3), సందీప్ శర్మ (4-0-21-2), మహీశ్ తీక్షణ (4-0-26-2) చెలరేగిపోవడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.
మ్యాచ్ అనంతరం శ్రేయస్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నప్పుడు 180-185 పరుగులు వస్తాయని అనుకున్నాను. ఇక్కడ ఛేజింగ్‌కు ఆ స్కోర్ అయితే ఓకే. కానీ మా ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. టోర్నీ ప్రారంభంలోనే ఈ తప్పిదం జరిగినందుకు సంతోషంగా ఉన్నాను. ఇది మంచి పిచ్. బంతి నెమ్మదిగా కదులుతుండింది. మా బౌలర్లు కూడా ఎక్కువ వేగంతో బంతులు వేయలేదు.
ఛేదన ఆరంభంలో నిదానంగా ఆడైనా మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. వరుసగా వికెట్లు కోల్పోయాము. ఒత్తిడిలో నేహల్ అద్భుతంగా ఆడాడు. అతను కొంత సమయం తీసుకున్నా ఆతర్వాత బౌలర్లపై ఎదురుదాడి చేయగలిగాడు. ఈ ఆట నుండి చాలా నేర్చుకోవచ్చు. ఈ నష్టం మంచిదేనని భావిస్తున్నాను. ముందుగా ఊహించినట్లుగా ఇవాళ మంచు కూడా పడలేదు. బౌలింగ్, బ్యాటింగ్‌లో మేము అమలు చేయలేకపోయిన విషయాలను పరిశీలించుకోవాలి.