
ఐపీఎల్-2025 (IPL 2025)లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సారథ్యంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది. తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై గెలిచిన పంజాబ్.. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. పంత్ సేనను సొంత మైదానంలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండో గెలుపు నమోదు చేసింది
ఇక ఈ రెండు విజయాల్లోనూ పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్‌ది కీలక పాత్ర. గుజరాత్‌పై 42 బంతుల్లోనే 97 పరుగులతో చెలరేగిన అయ్యర్.. లక్నోతో మ్యాచ్‌లో 30 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ధనాధన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.
బ్యాటింగ్ నైపుణ్యాలు అద్భుతం
ఈ నేపథ్యంలో ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్‌పై టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించాడు. శ్రేయస్ బ్యాటింగ్ నైపుణ్యాలు అద్భుతమని కొనియాడాడు. అదే విధంగా.. అయ్యర్ పట్ల కోల్‌కతా నైట్ రైడర్స్ వ్యవహరించిన తీరును గావస్కర్ ఈ సందర్భంగా విమర్శించాడు.
శ్రేయస్ అయ్యర్‌కు ఆ క్రెడిట్ దక్కలేదు
‘‘2024లో కేకేఆర్‌ను గెలిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. కానీ అతడికి దక్కాల్సిన, రావాల్సిన గుర్తింపు రాలేదు. కేకేఆర్ విజయంలో అతడికి క్రెడిట్ దక్కలేదు. ఏదేమైనా అతడి కెప్టెన్సీ రికార్డు ఎంతో గొప్పగా, ఆకట్టుకునే విధంగా ఉంది’’ అని గావస్కర్ ప్రశంసలు కురిపించాడు.
కాగా ఐపీఎల్-2024లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కోల్‌కతా జట్టు చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల విరామం తర్వాత కేకేఆర్‌కు మరోసారి టైటిల్ దక్కడంలో అతడు కీలకంగా వ్యవహరించాడు. అయితే, ఈ విజయం మెంటార్ గౌతం గంభీర్ ఖాతాలో పడింది. శ్రేయస్ అయ్యర్ కంటే ఎక్కువగా గౌతీకే క్రెడిట్ దక్కింది.
రూ. 26.75 కోట్లు ఖర్చు చేసి
ఈ పరిణామాల నేపథ్యంలో మెగా వేలానికి ముందే కేకేఆర్ ఫ్రాంఛైజీతో శ్రేయస్ అయ్యర్ తెగదెంపులు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2025 వేలంపాటలోకి వచ్చిన అతడి కోసం ఫ్రాంఛైజీలన్నీ ఎగబడ్డాయి. అయితే, ఎంత ధరకైనా వెనుకాడని పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసి ఆఖరికి అతడిని దక్కించుకుంది. కెప్టెన్‌గా అతడికి పగ్గాలు అప్పగించింది.
ఈ క్రమంలో పైసా వసూల్ ప్రదర్శనతో శ్రేయస్ అయ్యర్ రాణిస్తుండటంతో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం సంతోషంలో మునిగిపోయింది. ఇదే జోరులో వరుస విజయాలు సాధించి.. తొలి టైటిల్ గెలవాలని ఆకాంక్షిస్తోంది. కాగా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 117 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 3276 పరుగులు సాధించాడు. ఇందులో 23 అర్ధ శతకాలు ఉన్నాయి.
ఐపీఎల్-2025: లక్నో వర్సెస్ పంజాబ్ స్కోర్లు
👉లక్నో స్కోరు: 171/7 (20)
👉పంజాబ్ స్కోరు: 177/2 (16.2)
👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లక్నోపై పంజాబ్ విజయం
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69).