
Photo Courtesy: BCCI/IPL
సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Ziants) ఓడిపోవడాన్ని ఆ జట్టు మెంటార్ జహీర్ ఖాన్ (Zaheer Khan) జీర్ణించుకోలేకపోతున్నాడు. పంజాబ్ కింగ్స్ గెలుపునకు పరోక్షంగా పిచ్ క్యూరేటరే కారణమంటూ విస్మయకర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా లక్నో మంగళవారం పంజాబ్‌తో తలపడ్డ విషయం తెలిసిందే.
లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. టాస్ గెలిచిన పంజాబ్.. లక్నో జట్టును తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఏకనా వికెట్‌పై పరుగులు రాబట్టేందుకు లక్నో బ్యాటర్లు తడబడ్డారు.
అయితే, 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి లక్నో కష్టాల్లో పడిన వేళ నికోలస్ పూరన్ (44), ఆయుశ్ బదోని (41), అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 27)బ్యాట్ ఝులిపించారు. ఈ ముగ్గురి ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగలిగింది.
16.2 ఓవర్లలోనే..
ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (8) వికెట్ కోల్పోయినప్పటికీ పంజాబ్ అద్బుత రీతిలో పుంజుకుంది. వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రన్ సింఘ్ (34 బంతుల్లో 69) మెరుపు అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52), నేహాల్ వధేరా (25 బంతుల్లో 43) అజేయంగా నిలిచి జట్టు గెలుపును ఖరారు చేశారు. ఈ ముగ్గురి విజృంభణ కారణంగా 16.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి పంజాబ్ లక్నోపై ఘన విజయం సాధించింది.
మాకు సొంత మైదానం..
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం లక్నో మెంటార్, టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. లక్నో తమకు సొంత మైదానం అయినా.. పిచ్ క్యూరేటర్ మాత్రం పంజాబ్‌కు మేలు చేయడం నిరాశపరిచిందన్నాడు. ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘‘సొంత మైదానంలో మ్యాచ్ అంటే.. అక్కడి జట్టుకే కాస్త ఫేవర్‌గా ఉంటుంది.
కానీ ఇక్కడ పంజాబ్ క్యూరేటర్ ఉన్నారు
కానీ ఈ విషయంలో లక్నో క్యూరేటర్ చేసిన పని వల్ల.. ఇది హోం మ్యాచ్ అన్న భావనే రాలేదు. ఇక్కడి వికెట్ ఇలాగే ఉంటుందేమో బహుశా!.. ఇక్కడ పంజాబ్ క్యూరేటర్ ఉన్నారనిపించింది. ఈ మ్యాచ్‌లో నాకు అన్నింటికంటే ఇదే ఎక్కువ నిరాశను కలిగించింది.
క్యూరేటర్ మమ్మల్నే కాదు లక్నో అభిమానులను కూడా నిరాశకు గురిచేశారు. సొంతగడ్డపై లక్నో గెలుస్తుందని వారంతా భావించారు. కానీ ఇలా జరిగిపోయింది. జట్టుగా మేము పటిష్టంగా ఉన్నాము. మ్యాచ్‌లో ఓడిపోయామన్న వాస్తవాన్ని మేము అంగీకరిస్తున్నాం.
వినూత్న రీతిలో.. ముందడుగు
అయితే, సొంతమైదానంలో ఓటమి కాస్త ఎక్కువ బాధించింది. ఇక్కడ మాకు ఇంకో ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మేము కచ్చితంగా మెరుగ్గా రాణిస్తామనే నమ్మకం ఉంది. సంప్రదాయ పద్ధతులను కాస్త పక్కనపెట్టి.. వినూత్న రీతిలో.. ముందడుగు వేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము’’ అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
రహానే కూడా ఇలాగే
కాగా లక్నో పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని చెప్తారు. కానీ పంజాబ్‌తో మ్యాచ్‌లో లక్నో స్పిన్నర్లకు పెద్దగా కలిసిరాలేదు. రవి బిష్ణోయి, మణిమరన్ సిద్దార్థ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా.. దిగ్వేశ్ సింగ్ రాఠీ మాత్రం రెండు వికెట్లు పడగొట్టాడు.
మరోవైపు.. పంజాబ్ బౌలర్లలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్, రిస్ట్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆరంభమ్యాచ్‌లో ఓటమి తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే కూడా.. ఈడెన్ గార్డెన్స్ పిచ్ గురించి ఇదే తరహా వ్యా ఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
చదవండి: లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
Statement victory ✅
Skipper's second 5⃣0⃣ this season ✅
Consecutive wins ✅
Punjab Kings cap off a perfect day 🙌#TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/HSrX8KwiY4— IndianPremierLeague (@IPL) April 1, 2025