IPL 2025: సాయి సుదర్శన్‌ ఖాతాలో ఘనమైన రికార్డు | IPL 2025, RCB VS GT: Sai Sudharsan Has Scored Most Runs By A Indian After 28 Innings In IPL | Sakshi
Sakshi News home page

IPL 2025: సాయి సుదర్శన్‌ ఖాతాలో ఘనమైన రికార్డు

Published Thu, Apr 3 2025 2:01 PM | Last Updated on Thu, Apr 3 2025 3:02 PM

IPL 2025, RCB VS GT: Sai Sudharsan Has Scored Most Runs By A Indian After 28 Innings In IPL

Photo Courtesy: BCCI

తమిళనాడు యువ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ గత కొంతకాలంగా గుజరాత్‌ టైటాన్స్‌ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. 2022లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన ఈ చెన్నై చిన్నోడు.. ఇప్పటివరకు 28 ఇన్నింగ్స్‌లు ఆడి 48.80 సగటున, 127.19 స్ట్రయిక్‌రేట్‌తో 1220 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 8 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

ఐపీఎల్‌-2025లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 2) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో మరో కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడిన సాయి.. ఓ ఘనమైన ఐపీఎల్‌ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 28 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 

ఓవరాల్‌గా చూసినా 28 ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 28 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఘనత షాన్‌ మార్ష్‌కు దక్కుతుంది. మార్ష్‌ 28 ఇన్నింగ్స్‌ల తర్వాత 1267 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో 28 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన టాప్‌-5 బ్యాటర్లు
షాన్‌ మార్ష్‌- 1267
సాయి సుదర్శన్‌- 1220
లెండిల్‌ సిమన్స్‌- 1076
మాథ్యూ హేడెన్‌- 1076
క్రిస్‌ గేల్‌- 1071

భీకర ఫామ్‌లో సాయి
ప్రస్తుత ఐపీఎల్‌లో సాయి భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్‌ సెంచరీలు చేసి, మరో హాఫ్‌ సెంచరీని తృటిలో కోల్పోయాడు. గత ఏడు ఇన్నింగ్స్‌లో సాయి ప్రదర్శనలు పతాక స్థాయిలో ఉన్నాయి. ఇందులో సాయి ఓ సెంచరీ, 4 హాఫ్‌ సెంచరీలు చేశాడు.

గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో సాయి స్కోర్లు..
49 (36) vs RCB
63 (41) vs MI
74 (41) vs PBKS
103 (51) vs CSK 
6 (14) vs RCB
84* (49) vs RCB
65 (39) vs DC

ఐపీఎల్‌ అరంగేట్రం నుంచి సీజన్ల వారీగా సాయి స్కోర్లు..
2022- 5 మ్యాచ్‌ల్లో 145 పరుగులు (ఓ హాఫ్‌ సెంచరీ)
2023- 8 మ్యాచ్‌ల్లో 362 (3 హాఫ్‌ సెంచరీలు)
2024- 12 మ్యాచ్‌ల్లో 527 (సెంచరీ, 2 హాఫ్‌ సెంచరీలు)
2025- 3 మ్యాచ్‌ల్లో 186* (2 హాఫ్‌ సెంచరీలు)

  • సాయి అరంగేట్రం నుంచి గుజరాత్‌ టైటాన్స్‌కే ఆడుతున్నాడు. ఈ సీజన్‌ మెగా వేలానికి ముందు సాయిని గుజరాత్‌ రూ.8.50 కోట్లకు రీటైన్‌ చేసుకుంది.

కాగా, నిన్న జరిగిన మ్యాచ్‌లో సాయి కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో ఆర్సీబీపై గుజరాత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. సాయి 36 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 49 పరుగులు చేశాడు. 

సాయికి బట్లర్‌ (39 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్‌ (18 బంతుల్లో 30 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) తోడవ్వడంతో గుజరాత్‌ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌.. రెండు విజయాలతో (ఈ మ్యాచ్‌తో కలుపుకుని) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

ప్రస్తుత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సాయి (186 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. టాప్‌లో నికోలస్‌ పూరన్‌ (189) ఉన్నాడు. సాయి సహచరుడు బట్లర్‌ (166) మూడో స్థానంలో  నిలిచాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement