IPL 2025: పంత్‌కు లక్నో ఓనర్‌ క్లాస్‌..? రాహుల్‌ ఉదంతాన్ని గుర్తు చేసిన సీన్‌ | IPL 2025: Rishabh Pant, Sanjiv Goenka Intense Chat After LSG Shock Defeat To DC Reminds Fans Of KL Rahul Controversy | Sakshi
Sakshi News home page

IPL 2025: పంత్‌కు లక్నో ఓనర్‌ క్లాస్‌ పీకాడా..? రాహుల్‌ ఉదంతాన్ని గుర్తు చేసిన సీన్‌

Published Tue, Mar 25 2025 12:51 PM | Last Updated on Tue, Mar 25 2025 1:24 PM

IPL 2025: Rishabh Pant, Sanjiv Goenka Intense Chat After LSG Shock Defeat To DC Reminds Fans Of KL Rahul Controversy

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (మార్చి 24) జరిగిన రసవత్తర మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ షాకింగ్‌ ఓటమికి గురైంది. ఈ మ్యాచ్‌లో లక్నో గెలుపుకు సువర్ణావకాశాలు లభించినా ఒడిసి పట్టుకోలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేస్తూ అతి భారీ స్కోర్‌ చేసే అవకాశం (14 ఓవర్లలోనే 161 పరుగులు) వచ్చినా 209 పరుగులకే పరిమితమైంది. 

అనంతరం ఛేదనలో 113 పరుగులకే 6 వికెట్లు తీసినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. ఆశుతోష్‌ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విప్రాజ్‌ నిగమ్‌ (15 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఢిల్లీని గెలిపించారు.

ఈ మ్యాచ్‌లో లక్నో ఓటమికి కెప్టెన్‌ పంత్‌ ప్రధాన కారకుడయ్యాడు. తొలుత బ్యాటింగ్‌లో 6 బంతులాడి డకౌట్‌ అయిన పంత్‌.. ఆతర్వాత ఛేదనలో అత్యంత కీలక సమయంలో స్టంపింగ్‌ మిస్‌ చేసి ఢిల్లీకి మ్యాచ్‌ను వదిలేశాడు. 9 వికెట్లు కోల్పోయిన ఢిల్లీకి చివరి ఓవర్‌లో గెలుపుకు 6 పరుగులు అవసరం​ కాగా.. తొలి బంతికి పంత్‌ మొహిత్‌ శర్మను స్టంపౌట్‌ చేసే సువర్ణావకాశాన్ని జారవిడిచాడు. ఆతర్వాతి బంతికి సింగిల్‌ తీసిన మోహిత్‌ అశుతోష్‌కు స్ట్రయిక్‌ ఇచ్చాడు. అ‍ప్పటికే జోష్‌లో ఉండిన అశుతోష్‌ మూడో బంతిని సిక్సర్‌గా మలిచి ఢిల్లీకి అపురూప విజయాన్నందించాడు.

మ్యాచ్‌ అనంతరం లక్నో ఓనర్‌ సంజీవ్‌ గొయెంకా కెప్టెన్‌ పంత్‌ ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు కనిపించాడు. గొయెంకా-పంత్‌ వాడి వేడిగా చర్చిస్తున్నట్లు కనిపించే దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.  వారి మధ్య సంభాషణ గతేడాది కేఎల్‌ రాహుల్‌ ఉదంతాన్ని గుర్తు చేసింది. 

గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో ఓటమి అనంతరం గొయెంకా నాటి కెప్టెన్‌ రాహుల్‌ను దుర్భాషలాడినట్లు ప్రచారం జరిగింది. తాజా ఓటమి తర్వాత గొయెంకా పం​త్‌పై కూడా అదే రేంజ్‌లో ఫైరయ్యాడని టాక్‌ నడుస్తుంది. ఈ ఘటన కారణంగానే రాహుల్‌ లక్నోను వీడాడన్నది కాదనలేని సత్యం. ఈ విషయంపై రాహుల్‌ ఎక్కడా నోరు విప్పకపోయినా ఆ సీన్‌ చూసిన జనాలకు విషయం ఇట్టే అర్దమవుతుంది. 

రాహుల్‌ను కాదనుకునే పంత్‌ను తెచ్చిపెట్టుకున్న గొయెంకా ఇప్పుడు అతనితోనూ అలాగే ప్రవర్తిస్తున్నట్లున్నాడు. ఇదే రిపీటైతే పంత్‌ కూడా వచ్చే సీజన్‌లో లక్నోకు టాటా చెప్పడం ఖాయం. 

కాగా, పంత్‌ను గొయెంకా ఈ సీజన్‌ మెగా వేలంలో ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర (రూ. 27 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకున్నాడు. పంత్‌ గత సీజన్‌ వరకు ఢిల్లీకి ఆడాడు. ఢిల్లీతో ఉన్న అనుబంధం ఇంకా తగ్గలేదో ఏమో మరి, ఈ మ్యాచ్‌లో పంత్‌ తన స్థాయి మేరకు రాణించలేకపోయాడు. ఇదే కొనసాగితే పంత్‌ మహా కోపిష్టి అయిన గొయెంకా చేతిలో మున్ముందైనా అవమానాలకు గురి కావల్సి ఉం‍టుంది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ను వైజాగ్‌లో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ మార్చి 30న మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement