
61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 97 నాటౌట్
కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలుపు బోణీ
రాజస్తాన్ రాయల్స్‌పై 8 వికెట్లతో విజయం
కోల్‌కతా బౌలర్ల సమష్టి ప్రదర్శన
ఐపీఎల్‌లో పరుగుల వరద పారిన రెండు వరుస మ్యాచ్‌ల తర్వాత ఆ జోరుకు కాస్త విరామం. పొడిగా, బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై సాగిన మ్యాచ్‌లో సీజన్‌లో తక్కువ స్కోరు నమోదు కాగా, డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) పైచేయి సాధించి తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ కట్టుదిట్టమైన స్పిన్‌తో ముందుగా రాజస్తాన్‌ను నైట్‌రైడర్స్ తక్కువ స్కోరుకే పరిమితం చేసింది.
ఆ తర్వాత డికాక్ దూకుడైన బ్యాటింగ్‌తో లక్ష్యఛేదనను సునాయాసం చేసేశాడు. 15 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయాన్నందుకుంది. అన్ని రంగాల్లో విఫలమైన రాజస్తాన్ రాయల్స్ తమ ‘హోం గ్రౌండ్’లో పేలవ ప్రదర్శనతో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.
గువహాటి: డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ ఐపీఎల్ సీజన్‌లో గెలుపు బోణీ చేసింది. గత మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన నైట్‌రైడర్స్ బుధవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురేల్ (28 బంతుల్లో 33; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, యశస్వి జైస్వాల్ (24 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ (15 బంతుల్లో 25; 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.
స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై వరుణ్, మొయిన్ అలీ 8 ఓవర్లలో 40 పరుగులకే 4 వికెట్లు తీసి రాయల్స్‌ను దెబ్బ కొట్టారు. వైభవ్ అరోరా, హర్షిత్ కూడా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం కోల్‌కతా 17.3 ఓవర్లలో 2 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్వింటన్ డికాక్ (61 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. సునీల్ నరైన్ అనారోగ్యం కారణంగా మ్యాచ్‌కు దూరం కావడంతో మొయిన్ అలీకి కోల్‌కతా చోటు కల్పించగా, ఫారుఖీ స్థానంలో రాజస్తాన్ జట్టులోకి హసరంగ వచ్చాడు.
సమష్టి వైఫల్యం...
రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆసాంతం ఒకే తరహాలో సాదాసీదాగా సాగింది. ఆశించిన స్థాయిలో దూకుడైన బ్యాటింగ్ లేకపోగా, ఒక్కటీ సరైన భాగస్వామ్యం రాలేదు. జైస్వాల్ ధాటిగానే మొదలు పెట్టినా... మరోవైపు సంజు సామ్సన్ (11 బంతుల్లో 13; 2 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేదు. ‘లోకల్ బాయ్’ పరాగ్ తన తొలి 7 బంతుల్లో 2 సిక్సర్లు బాది అభిమానులను ఆకట్టుకున్నాడు.
వరుణ్ ఓవర్లోనూ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్స్ బాదిన అతను...అదే ఓవర్లో మరో షాట్‌కు ప్రయత్నించి వెనుదిరగడంతో మైదానంలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత హసరంగ (4)ను ముందుగా పంపిన ప్రయోగం ఫలితం ఇవ్వకపోగా, నితీశ్ రాణా (9 బంతుల్లో 8), శుభమ్ దూబే (12 బంతుల్లో 9; 1 ఫోర్) కూడా విఫలమయ్యారు. 67/1తో మెరుగైన స్థితిలో కనిపించిన రాజస్తాన్ 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి 82/5కి చేరింది. దాంతో ‘ఇంపాక్ట్ సబ్’గా అదనపు బ్యాటర్‌ను శుభమ్ దూబే రూపంలో ఏడో స్థానంలో బరిలోకి దింపింది.
అయితే ఒత్తిడిలో అతనూ ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో జురేల్ కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకున్నాడు. హర్షిత్ రాణా వరుస ఓవర్లలో అతను రెండేసి ఫోర్లు కొట్టాడు. అయితే హర్షిత్ తన తర్వాతి ఓవర్లో జురేల్, ప్రమాదకర బ్యాటర్ హెట్‌మైర్ (8 బంతుల్లో 7; 1 ఫోర్)లను వెనక్కి పంపించాడు. చివర్లో ఆర్చర్ (7 బంతుల్లో 16; 2 సిక్స్‌లు) కొట్టిన రెండు సిక్సర్లతో రాజస్తాన్ స్కోరు 150 పరుగులు దాటింది.
డికాక్ మెరుపులు...
ఛేదనలో డికాక్ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. పవర్‌ప్లేలో జట్టు స్కోరు 40 పరుగులు కాగా, డికాక్ ఒక్కడే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 పరుగులు సాధించాడు. మరోవైపు కేకేఆర్ తరఫున ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడిన మొయిన్ అలీ (5) రనౌట్ కావడంతో జట్టు మొదటి వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ అజింక్య రహానే (15 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయినా, డికాక్ జోరుతో స్కోరు వేగంగా సాగిపోయింది.
35 బంతుల్లోనే డికాక్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అతనికి గెలుపు దిశగా అంగ్‌కృష్ రఘువంశీ (17 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) సహకరించాడు. దూకుడు తగ్గించని డికాక్ శతకం దిశగా దూసుకుపోయాడు. చివరి 3 ఓవర్లలో నైట్‌రైడర్స్ విజయానికి 17 పరుగులు, డికాక్ సెంచరీకి 19 పరుగులు అవసరం కాగా, ఆర్చర్ ఓవర్లో డికాక్ ఒక ఫోర్, 2 సిక్స్‌లు బాదినా... చివరకు 97 వద్దే అతను ఆగిపోవాల్సి వచ్చింది.
స్కోరు వివరాలు
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) హర్షిత్ రాణా (బి) అలీ 29; సామ్సన్ (బి) అరోరా 13; పరాగ్ (సి) డికాక్ (బి) వరుణ్ 25; నితీశ్ రాణా (బి) అలీ 8; హసరంగ (సి) రహానే (బి) వరుణ్ 4; జురేల్ (బి) హర్షిత్ రాణా 33; శుభమ్ (సి) రసెల్ (బి) అరోరా 9; హెట్‌మైర్ (సి) రఘువంశీ (బి) హర్షిత్ రాణా 7; ఆర్చర్ (బి) జాన్సన్ 16; తీక్షణ (నాటౌట్) 1; తుషార్ దేశ్‌పాండే (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–33, 2–67, 3–69, 4–76, 5–82, 6–110, 7–131, 8–138, 9–149. బౌలింగ్: స్పెన్సర్ జాన్సన్ 4–0–42–1, వైభవ్ అరోరా 4–0–33–2, హర్షిత్ రాణా 4–0–36–2, మొయిన్ అలీ 4–0–23–2, వరుణ్ 4–0–17–2.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: మొయిన్ అలీ (రనౌట్) 5; డికాక్ (నాటౌట్) 97; రహానే (సి) దేశ్‌పాండే (బి) హసరంగ 18; రఘువంశీ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.3 ఓవర్లలో 2 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–41, 2–70. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 2.3–0–33–0, మహీశ్ తీక్షణ 4–0–32–0, రియాన్ పరాగ్ 4–0–25–0, సందీప్ శర్మ 2–0–11–0, హసరంగ 3–0–34–1, నితీశ్ రాణా 1–0–9–0, తుషార్ 1–0–7–0.
ఐపీఎల్‌లో నేడు
హైదరాబాద్ X లక్నో
వేదిక: హైదరాబాద్
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం