
సాక్షి, హైదరాబాద్: మెనోర్కా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సాకేత్ తమిళనాడుకు చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో బరిలోకి దిగాడు.
తొలి రౌండ్ మ్యాచ్‌లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–1, 6–2తో పెడ్రో కాచిన్ (అర్జెంటీనా)–ఇజాన్ కొరెత్యా (స్పెయిన్) జోడీపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 48 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్‌కుమార్ నాలుగు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశారు. తమ సర్వీస్‌లను నిలబెట్టుకొని, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు.
అనిరుద్‌కు నిరాశ
మరోవైపు ఇదే టోర్నీలో బరిలోకి దిగిన హైదరాబాద్‌కే చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ మాత్రం తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. గతవారం డేవిడ్ వెగా హెర్నాండెజ్ (స్పెయిన్)తో కలిసి జిరోనా ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గిన అనిరుధ్ అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు.
తొలి రౌండ్‌లో అనిరుధ్ (భారత్)–హెర్నాండెజ్ ద్వయం 6–7 (4/7), 7–5, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ డానియల్ కుకెర్మన్ (ఇజ్రాయెల్)–జోషువా పారిస్ (బ్రిటన్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్ జంట తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో మాత్రం అనిరుధ్ ద్వయం తడబడింది.
భారత్‌కే చెందిన టాప్ సీడ్ జోడీ విజయ్ సుందర్ ప్రశాంత్–జీవన్ నెడుంజెళియన్ జోడీ 2–6, 0–6తో మాటియో–ఆండ్రియా (ఇటలీ) జంట చేతిలో ఓటమి పాలైంది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో నిక్కీ పునాచా (భారత్)– గోర్నెస్ (స్పెయిన్) ద్వయం 6–3, 6–3తో వరోనా–టబెర్నర్ (స్పెయిన్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.