
చెన్నై: మెక్సికో సిటీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ మూడో ర్యాంకర్ శ్రీరామ్ బాలాజీ పోరాటం ముగిసింది. మెక్సికో సిటీలో జరిగిన ఈ టోర్నీ డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ రేయస్ వరేలా (మెక్సికో) ద్వయం 4–6, 5–7తో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–ఆస్టిన్‌క్రాయిసెక్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది.
86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బాలాజీ–వరేలా మూడు ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశారు. సెమీఫైనల్లో ఓడిన బాలాజీ–వరేలాలకు 3470 డాలర్ల (రూ. 2 లక్షల 98 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.