
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ క్రికెట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో (GEPL) సారా ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఈ లీగ్ గతేడాదే పరిచయం చేయబడింది. తొలి సీజన్ విజయవంతం కావడంతో రెండో సీజన్‌లో కొత్త జట్లను ఆహ్వానించారు. ఈ లీగ్‌లో ఆటగాళ్లు రియల్ క్రికెట్-24 అనే డిజిటల్ ప్లాట్‌ఫాంపై పోటీపడతారు. ఈ లీగ్ యొక్క గ్రాండ్ ఫినాలే ఈ ఏడాది మేలో జరుగుతుంది.
ఈ లీగ్ డిజిటల్ స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ యొక్క సరిహద్దులను అధిగమించడానికి కృషి చేస్తుంది. ఈ లీగ్‌లో సారా ప్రవేశం తమకు మేలు చేస్తుందని నిర్వహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్పోర్ట్స్‌పై సారాకు ఉన్న ఆసక్తి తమ లీగ్‌ను అన్ని వర్గాల ప్రజలకు పరిచయం చేస్తుందని అన్నారు. సారాకు ఉన్న అపారమైన ప్రజాదరణ తమ లీగ్‌ను భారత్‌లోని అన్ని మూలలకు తీసుకెళ్తుందని ఆకాంక్షించారు.
గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఫ్రాంచైజీనే కొనుగోలు చేయాలన్న సారా నిర్ణయం ఈ ప్రాంతంతో ఆమెకున్న లోతైన అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. సారా తండ్రి సచిన్ ముంబైలోనే పుట్టి పెరిగాడు. సచిన్ దేశవాలీ కెరీర్ మొత్తం ముంబైతోనే సాగింది. రిటైరయ్యాక కూడా సచిన్ ముంబైతో అనుబంధం కలిగి ఉన్నాడు. సచిన్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌లో (ఐపీఎల్ ఫ్రాంచైజీ) భాగమై ఉన్నాడు. సారా సోదరుడు అర్జున్ టెండూల్కర్ కూడా ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.