
టీమిండియా కొత్త ప్రధాన కోచ్ ప్రకటనపై సస్పెన్స్ వీడటం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ అంశంపై ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసినా.. టీ20 ప్రపంచకప్-2024 వరకు అతడినే కొనసాగించింది బీసీసీఐ. ఈ క్రమంలో టైటిల్ గెలిచి సగర్వంగా తన బాధ్యతల నుంచి వైదొలిగాడు ద్రవిడ్.
ఇక ఇప్పటికే ద్రవిడ్ స్థానంలో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కోచ్‌గా వస్తాడనే ప్రచారం జరుగుతున్నా బీసీసీఐ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
అయితే, శ్రీలంకతో సిరీస్ నాటికి మాత్రం పూర్తిస్థాయి కోచ్ అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే వెల్లడించారు. అయినప్పటికీ హెడ్‌కోచ్ ప్రకటన విషయంలో ఆలస్యం జరుగుతోంది.
బ్యాటింగ్ కోచ్‌గానూ గంభీర్?
అయితే, జీతం విషయంలో గంభీర్- బోర్డు మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని.. ఆలస్యానికి కారణం ఇదేనంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. హెడ్ కోచ్‌గా ఉండటంతో పాటు బ్యాటింగ్ కోచ్‌గానూ గంభీర్ వ్యవహరించే అవకాశం ఉందని.. అయితే, ఈ విషయమై చర్చలు కొలిక్కి రాలేదని తెలిపింది.
కాగా రాహుల్ ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ పదవీ కాలం కూడా ముగియనున్నది. ఈ నేపథ్యంలో సహాయక సిబ్బంది నియామకంలో తనకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని గంభీర్ బీసీసీఐకి షరతు విధించినట్లు సమాచారం.
అదే విధంగా వరల్డ్‌క్లాస్ బ్యాటర్ అయిన తాను ఉండగా.. ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ అవసరం లేదనే యోచనలో అతడు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. గంభీర్‌తో పాటు డబ్ల్యూవీ రామన్ కూడా హెడ్ కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూకు హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ ఎవరన్న అంశంలో అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే క్లారిటీ రానుంది.
చదవండి: BCCI: రోహిత్‌కు రూ. 5 కోట్లు.. మూడు టైటిళ్ల ధోనికి ఎంత? కపిల్ డెవిల్స్ పాపం!