
ఐపీఎల్‌కు పోటీగా రేపటి నుండి (ఏప్రిల్ 11) పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి పీఎస్‌ఎల్ ఐపీఎల్‌తో పోటీపడుతూ ఒకే సమయంలో లీగ్‌ను నిర్వహిస్తుంది. ఐపీఎల్, పీఎస్‌ఎల్ సమాంతరంగా జరుగనుండటంతో ఈసారి పాక్ అభిమానులు కూడా పీఎస్‌ఎల్‌పై ఆసక్తి చూపడం లేదు.
ఐపీఎల్ 2025లో ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండటంతో పాక్ ఫ్యాన్స్ క్యాష్ రిచ్ లీగ్‌ను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఐపీఎల్‌తో తేదీలను క్లాష్ చేసుకుని పీఎస్‌ఎల్ ఇబ్బందులను కొని తెచ్చుకుంది. సాధారణంగా ఈ లీగ్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరుగుతుంది. అలాంటిది అంతర్జాతీయ షెడ్యూల్‌ను కారణంగా చూపుతూ పాక్ క్రికెట్ బోర్డు పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్ జరిగే ఏప్రిల్, మే నెలలకు మార్చింది.
పైకి చెప్పనప్పటికీ పీసీబీ ఐపీఎల్‌తో పోటీపడాలనే పీఎస్‌ఎల్‌ను ఏప్రిల్, మే నెలలకు మార్చింది. తీరా చూస్తే స్వదేశంలోనే ఆదరణ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంది. డేవిడ్ వార్నర్ లాంటి వెటరన్ ఆటగాళ్లు మినహా విదేశీ స్టార్లంతా ఐపీఎల్‌లోనే ఉండటంతో ఈసారి పీఎస్‌ఎల్ కళావిహీనంగా మారింది. అదే ఐపీఎల్‌తో పోటీపడకపోయుంటే కొందరైనా విదేశీ స్టార్లు పీఎస్‌ఎల్‌లో ఆడేవారు. ఐపీఎల్‌తో పోటీ పడి పీసీబీ చేజేతులా సొంత లీగ్‌ను నాశనం చేసుకుంది.
ఈ సారి లీగ్‌కు ప్రజాదరణ లేకపోవడంతో ఆటగాళ్లే రంగలోకి దిగి అభిమానులను తమవైపు మళ్లించుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా పాక్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ మంచి మాటలు చెబుతూ సొంత అభిమానులను ఐపీఎల్ పైనుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడు. మంచి క్రికెట్ ఆడి వినోదాన్ని పంచితే జనాలు ఐపీఎల్‌ను వదిలి పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను (పీఎస్‌ఎల్) చూస్తారని హసన్ అన్నాడు.
ఎవరూ ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్‌కు లభించిన ప్రజాదరణ చూసి పాక్ సహా చాలా దేశాలు సొంత లీగ్‌ను ప్రారంభించి ఆశించినంత సక్సెస్‌ను సాధించలేకపోయాయి.
పీఎస్‌ఎల్-2025 విషయానికొస్తే.. రేపు జరుగబోయే లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో హసన్ అలీ కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2016లో మొదలైన పీఎస్‌ఎల్ గతేడాది వరకు అడపాదడపా ఆదరణతో సాగింది. అయితే ఈ సీజన్‌లో ఐపీఎల్‌తో పోటీ పెట్టుకోవడంతో ఉన్న కాస్త ప్రజాదరణ కూడా కోల్నోయే ప్రమాదాన్ని తెచ్చుకుంది.
పాక్ జాతీయ జట్టు విషయానికొస్తే.. గత రెండేళ్లలో అదఃపాతాళానికి పడిపోయిన ఈ జట్టు ఇటీవలికాలంలో మరింత పతనమైంది. స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగి ఒక్క విజయం కూడా లేకుండా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఆతర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ కూడా ఘోర పరాభవాలను ఎదుర్కొంది. ఆ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయిన పాక్ జట్టు.. ఆతర్వాత జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది.