కేన్‌ విలియమ్సన్‌కు అవమానం | IPL Reject Kane Williamson Goes Unpicked In PSL 2025 Draft | Sakshi
Sakshi News home page

కేన్‌ విలియమ్సన్‌కు అవమానం

Published Mon, Jan 13 2025 7:05 PM | Last Updated on Mon, Jan 13 2025 8:01 PM

IPL Reject Kane Williamson Goes Unpicked In PSL 2025 Draft

దిగ్గజ బ్యాటర్‌, న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌కు అవమానం జరిగింది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) డ్రాఫ్ట్‌లో కేన్‌ మామను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ప్లాటినమ్‌ డ్రాఫ్ట్‌లో కేన్‌ మరో 43 మంది స్టార్‌ ఆటగాళ్లతో కలిసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఐపీఎల్‌ 2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన కేన్‌ను పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో కూడా ఎవరూ పట్టించుకోలేదు. కేన్‌ బరిలో నిలిచిన ప్లాటినమ్‌ డ్రాఫ్ట్‌ నుంచి 10 మంది ఆటగాళ్లను ఎంపిక చేసున్నాయి ఫ్రాంచైజీలు.

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆసీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను కరాచీ కింగ్స్‌ ఫ్రాంచైజీ దక్కించుకుంది. వార్నర్‌ రిటైర్మెంట్‌ తర్వాత కూడా సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో వార్నర్‌ అదరగొడుతున్నాడు. ఈ లీగ్‌లో వార్నర్‌ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 63.20 సగటున 142.34 స్ట్రయిక్‌రేట్‌తో 316 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత ఫామ్‌ కారణంగానే పీఎస్‌ఎల్‌ డ్రాఫ్ట్‌లో వార్నర్‌కు మాంచి గిరాకీ ఉండింది.

విలియమ్సన్‌ విషయానికొస్తే.. ఈ కివీస్‌ లెజెండ్‌ ఇటీవలి కాలంలో పెద్దగా టీ20లు ఆడింది లేదు. 2023లో ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడని కేన్‌.. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ (2024) కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌లో కేన్‌ ఎంపిక కాకపోవడానికి అతని ఫిట్‌నెస్‌ కూడా ఓ కారణమే. ఇటీవలి కాలంలో కేన్‌ తరుచూ గాయాల బారిన పడుతున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఉండి కూడా కేన్‌ పొట్టి ఫార్మాట్‌లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు. బ్యాటింగ్‌లో వేగం లేకపోవడం, భారీ షాట్లు ఆడలేకపోవడం కేన్‌కు ప్రధాన సమస్యలు.

కేన్‌ ప్రైవేట్‌ లీగ్‌ల్లో పెద్దగా రాణించలేకపోయినా అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం పర్వాలేదనిపించాడు. కేన్‌ తన దేశం తరఫున 93 టీ20లు ఆడి 33.44 సగటున 2575 పరుగులు చేశాడు. కేన్‌ను ప్రైవేట్‌ లీగ్‌ల్లో ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోకపోవడానికి అతని వయసు మరో ప్రధాన కారణం. ప్రస్తుతం కేన్‌ మామ వయసు 34 ఏళ్లు.

కేన్‌ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో కేన్‌ డర్బన్‌ జెయింట్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే కేన్‌ అదరగొట్టాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్‌ 40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

పీఎస్‌ఎల్‌ డ్రాఫ్ట్‌లో ఆయా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్న పలువురు స్టార్‌ ఆటగాళ్లు..
డేవిడ్‌ వార్నర్‌ (కరాచీ కింగ్స్)
డారిల్‌ మిచెల్‌ (లాహోర్‌ ఖలందర్స్‌)
మార్క్‌ చాప్‌మన్‌ (క్వెట్టా గ్లాడియేటర్స్‌)
మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (ముల్తాన్‌ సుల్తాన్స్‌)
ఆడమ్‌ మిల్నే (కరాచీ కింగ్స్‌)
ఫిన్‌ అలెన్‌ (క్వెట్టా గ్లాడియేటర్స్‌)
జేసన్‌ హోల్డర్‌ (ఇస్లామాబాద్‌ యునైటెడ్‌)
ఆమెర్‌ జమాల్‌ (కరాచీ కింగ్స్‌)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement