
రొయ్యల ప్రాసెస్ కంపెనీలో గ్యాస్ లీక్
నెల్లూరు ఆస్పత్రిలో బాధితులకు చికిత్స
తోటపల్లిగూడూరు: తోటపల్లిగూడూరు మండలం అనంతపురం గ్రామం వాటర్ బేస్ కంపెనీలో శనివారం అమ్మోనియా గ్యాస్ లీకై పదిమంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హుటాహుటిన నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్థానికులు, కంపెనీ యాజమాన్యం కథనం మేరకు వివరాలు.. వాటర్ బేస్ కంపెనీలో రొయ్యల ప్రాసెస్ నిర్వహిస్తుంటారు. షిఫ్ట్‌కు సుమారు 2 వేల మంది వరకు ఇక్కడ పనిచేస్తున్నట్టు సమాచారం. అయితే కంపెనీ మిషన్ రూమ్‌లో అమ్మోనియా గ్యాస్ లీకై అక్కడే ఉన్న పదిమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఆపరేటర్ ఎం.సురేష్ లీకేజీని ఆపే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడ్డారు. కంపెనీ యాజమాన్యం అస్వస్థతకు గురైన వారితో పాటు సురేష్‌ను నెల్లూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కంపెనీ ప్రతినిధులు ప్రకటన చేస్తూ..
అయితే కంపెనీకి చెందిన సీఈఓ రమాకాంత్ ఆకుల, ఎండీ వరుణ్ థాపర్ ప్రమాదంపై ప్రకటన విడుదల చేశారు. ఆపరేటర్ వావిళ్లపాటి సురేష్‌పై కంప్రెషర్ ఆయిల్ పడడం వల్ల బొబ్బలు అయినట్టు ప్రకటించారు. అదే క్రమంలో లీకేజీ వల్ల ఎమర్జెన్సీ అలారం మోగిందని ఒకే సమయంలో కార్మికుల బయటకు వచ్చే క్రమంలో తోపులాట వల్ల అసోంకు చెందిన మీనా(25), ఒడిశాకు చెందిన బాషా(24) కళ్లు తిరిగి పడ్డట్టు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న నెల్లూరు ఆర్డీఓ అనూష వివరాలు సేకరించారు. గ్యాస్ లీకేజీ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలిపారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వాటర్ బేస్ కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీకేజీపై ఆరా తీశారు.
గ్రామస్తుల భయాందోళన
కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీకవడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన వారు మాస్కులు ధరించారు. రొయ్యలను ప్రాసెస్ చేసే క్రమంలో కంపెనీ అమ్మోనియం గ్యాస్‌ను ఉపయోగిస్తుంది. అయితే ఎక్కడో పొరపాటు జరిగి గ్యాస్ లీకై నట్టు స్థానికులు వెల్లడిస్తున్నారు. వెంటనే సైరన్ మోగించడంతో మిగతా కార్మికులు బయటకు పరుగులు తీసి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆపరేటర్ సురేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది.
పదిమంది కార్మికులకు అస్వస్థత
ఒకరి పరిస్థితి ఆందోళనకరం