
రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించాలి
● తిరుపతి ఎంపీ గురుమూర్తి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): దేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని జరుపుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలువుతుందని, మేధావులు, విద్యావంతులు ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న పాలకులు, పోలీసులకు రాబోయే రోజుల్లో అది వారి మెడకు చుట్టుకుంటుందని హెచ్చరించారు. నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌తో కలిసి ఎంపీ గురుమూర్తి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండానే వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. గిరిజనులను బెదిరించి కాకాణిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. న్యాయస్థానాల మీద తమకు నమ్మకం ఉందని కాకాణి కోర్టును ఆశ్రయిస్తే ఈలోపు ఈ పాలకులు తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. అసలు టీడీపీ నేతలే పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేస్తూ రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్నారన్నారు. ఏపీలో పరిశ్రమలు మూత పడడానికి ఈ ప్రభుత్వ సంస్కరణలే కారణమన్నారు. అక్రమ కేసులకు, నిర్బంధాలకు వైఎస్సార్‌సీపీ క్యాడర్, కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదన్నారు.
టీటీడీ గోశాల ఆవుల మృతిపై విచారణ జరపాలి
తిరుపతిలోని టీటీడీ గోశాలలో ఉన్న గోవుల మృతిపై మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పినవన్నీ వాస్తవాలేనన్నారు. టీటీడీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. అఖిల పక్షాన్ని తీసుకెళ్లి గోశాలలను పరిశీలించేందుకు అనుమతులివ్వాలని డిమాండ్ చేశారు. తిరుమలలో ప్రధాన పూజలు అందుకునే గోవు, దూడలు, ఎద్దు మృతి చెందాయన్నారు. సాక్షాత్తు సీఎం ఎదుటే టీటీడీ ఈఓ, చైర్మన్ వాదులాడుకుంటుంటే అక్కడ ఏ మాత్రం పాలన ఉందో అర్థమవుతుందన్నారు. భూమన హిందువో, నాస్తికుడో తెలియాలంటే ఆయన ఇంటికి వెళ్తే తెలుస్తుందని, ఈ అంశంపై వాదనలు అనవసరమన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ప్రతిపక్షంపై దుష్ప్రచారాలు చేస్తోందన్నారు. అన్ని అంశాలపై అఖిల పక్షంను ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.