
ఎస్టీ వర్గీకరణతోనే యానాదుల ప్రగతి
నెల్లూరు(బృందావనం): ఎస్టీ వర్గీకరణతోనే యానాదుల అభివృద్ధి సాధ్యమని యానాది రిజర్వేషన్ పోరా ట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరు చినపెంచలయ్య పిలుపునిచ్చారు. రాష్ట్రంలో యానాదుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా యానాదులు అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ తప్పదన్నారు. యానాదుల ఎస్టీ వర్గీకరణ చేపట్టాలంటూ సోమవారం నెల్లూరు నగరంలో ‘ఎస్టీ వర్గీకరణ భేరీ’ చేపట్టారు. సుబేదారుపేట నుంచి పురమందిరం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. చినపెంచలయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా యానాదుల బతుకుల్లో ఎటు వంటి మార్పు రాలేదన్నారు. విద్య, ఉద్యోగ, రాజ కీయ రంగాల్లో యానాదులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 37 లక్షల గిరిజన జనాభాలో 10 లక్షల మందికిపైగా యానాదులు ఉన్నారన్నారు. వారికి బడ్జెట్‌లో కనీస కేటాయింపులు జరగడం లేదని వివక్షకు గురవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలోనే ఉమ్మడి ఎస్టీ రిజర్వేషన్లను కూడా తక్షణమే వర్గీకరించి యానాదులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జూన్‌లో సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె నుంచి ఎస్టీ వర్గీకరణ సాధన యాత్రను ప్రారంభించి రాష్ట్రమంతటా పర్యటించి అమాయక ఆదిమ జాతి గిరిజనులైన యానాదులను చైతన్యవంతం చేస్తామన్నారు. యానాది రాష్ట్ర ఉద్యోగ సంఘం అధ్యక్షుడు చేవూరు సుబ్బారావు సభకు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో యానాది సంఘం రాష్ట్ర నేతలు మేకల శ్రీనివాసులు, చలంచర్ల పెద్దబ్రహ్మయ్య, బాపట్ల బ్రహ్మయ్య, పొన్నూరు అంకమ్మరావు, చందేటి ఉష, పోట్లూరు హనుమంతరావు, రాపూరి కృష్ణయ్య, మురళి, రవీంద్ర, వరలక్ష్మి వివిధ జిల్లాలకు చెందిన ఆ సంఘ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యానాదుల నేతలు పాల్గొన్నారు.
వెన్నెలకంటికి నివాళి
తొలుత నక్కలోళ్ల సెంటర్‌లో ఉన్న వెన్నెలకంటి రాఘవయ్య భవన్‌లోని వెన్నెలకంటి రాఘవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అక్కడి నుంచి ర్యాలీ పురమందిరం వరకు సంప్రదాయ డప్పునృత్యాలు, కీలుగుర్రాల ఆటలతో, జానపద గీతాలతో వందలాదిగా యానాదులు తరలివచ్చారు. పురమందిరంలోని వెన్నెలకంటి రాఘవ య్య, బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
సింహపురిలో కదంతొక్కిన
యానాదులు
యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావం
సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు
కల్లూరు చినపెంచలయ్య

ఎస్టీ వర్గీకరణతోనే యానాదుల ప్రగతి