
అనుమానాస్పదంగా తిరుగుతుండగా..
పొదలకూరు: పట్టణానికి సమీపంలోని చిట్టేపల్లి తిప్ప వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు, వారి వెంట ఉన్న ఆటో డ్రైవర్‌ను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు.. బుధవారం నెల్లూరుకు చెందిన సుహాసిని, రత్తాలు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేంద్రసింగ్ కలిసి ఆటోలో బయలుదేరి తిప్ప వద్దకు చేరుకున్నారు. కొండపై అనుమానాస్పదంగా సంచరించడమే కాక వారి వద్ద చిన్నపాటి గునపాలు, తాళాలు, చైనా కత్తులు ఉండటంతో స్థానికులు భయపడి అటకాయించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. తాము రంగురాళ్లు సేకరించేందుకు వచ్చామని వారు పోలీసులకు తెలిపారు. పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఆటో డ్రైవర్ మాత్రం తనకు బాడుగ అదనంగా ఇస్తామంటే వచ్చానని, ఎలాంటి వివరాలు తెలియదని వాపోయాడు.