
పెళ్లికి నిరాకరించడంతో..
● మనస్తాపంతో యువతి ఆత్మహత్య
కొడవలూరు: ప్రేమించిన వ్యక్తి పెళ్లి నిరాకరించాడని మనస్తాపం చెంది క్షణికావేశంలో ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని నార్తురాజుపాళెంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బుధవారం పోలీసులు, స్థానికులు వివరాలు వెల్లడించారు. స్థానిక టపాతోపు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న రొయ్యల ఫ్యాక్టరీలో ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన సునీత యాలం (21) కొన్నేళ్లుగా పని చేస్తోంది. అక్కడ పనిచేసే బిట్టూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడగా అది కాస్తా ప్రేమగా మారింది. కొన్నినెలల క్రితం యువతి పని మానేసి సొంతూరికి వెళ్లింది. అక్కడి నుంచి బిట్టూతో ఫోన్‌లో మాట్లాడుతుండేదని ఆమె స్నేహితులు పోలీసులకు తెలిపారు. బిట్టూ కూడా మూడు నెలల క్రితం పని మానేసి వెళ్లిపోయాడు. సునీత వారంరోజుల క్రితం తిరిగి ఫ్యాక్టరీలో పనికి చేరింది. ఫ్యాక్టరీకి పక్కనే ఉన్న గదుల్లో యాజమాన్యమే వసతి కల్పిస్తోంది. సునీత అక్కడ ఉంటూ రెండురోజులుగా బిట్టూతో ఫోన్‌లో సంభాషిస్తూ కన్నీరు పెట్టుకుంటోందని రూమ్మేట్స్ పోలీసులకు తెలిపారు. మంగళవారం రాత్రి 11 గంటల వరకూ అతడితో మాట్లాడినట్లు చెప్పారు. ఆ తర్వాత అందరూ నిద్రపోయాక మెట్లపైన ఉన్న కిటికీ రంధ్రాలకు ఉరేసుకుని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యం అందించిన సమాచారం మేరకు ఇన్‌చార్జి ఎస్సై పి.నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతురాలి ఫోన్‌ను స్వాధీ నం చేసుకున్నారు. ఆమె స్నేహితులు తెలిపిన వివరాలు, ఫోన్ సంభాషణల ఆధారంగా బిట్టూ పెళ్లికి నిరాకరించడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.