
ఉపాధి కూలీలకు బీమా సౌకర్యం
● డ్వామా పీడీ గంగా భవాని
పొదలకూరు: ఎన్‌ఆర్‌ఈజీఎస్ జాబ్‌కార్డులున్న కూలీలకు రెండు రకాల బీమా సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని డ్వామా పీడీ గంగా భవాని పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశం మందిరంలో బుధవారం రాపూరు, పొదలకూరు, సైదాపురం, కలువాయి మండలాల ఉపాధి సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలను కేంద్రం ప్రవేశపెట్టినట్టు చెప్పారు. కమిషనర్ ఆదేశాల మేరకు వాటిని కూలీలకు వర్తింపజేసేందుకు క్షేత్రస్థాయిలో ఎఫ్‌ఏలు, టీఏలు, ఏపీఓలు కృషి చేయాలన్నారు. జిల్లాలో 4.82 లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నారని వీరందరికీ బీమా సౌకర్యం కల్పించాల్సిందిగా పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 75 వేలమంది పనులకు హాజరవుతున్నారని ఈ సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలన్నారు. మండలానికి 250 కుంటలను మంజూరు చేసినా పురోగతి లేదన్నారు. 2023 – 24కు సంబంధించి అన్ని మండలాల్లో సోషల్ ఆడిట్ పూర్తి చేశామని, త్వరలో 2024 – 25 ఆడిట్‌ను కూడా చేపడతామన్నారు.