
ఆశ పెట్టి.. నగదు వసూలు చేసి..
రూ.21 లక్షలిచ్చా
కావలి: కావలిలో వైట్‌కాలర్ నేరాలు పెరుగుతున్నాయి. పోలీసులే పాత్రధారులుగా ముసునూరులో రూ.కోట్ల కుంభకోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రూ.కోట్లు కొల్లగొట్టిన పాతనేరస్తుడు, అతడికి సహకరించిన పోలీసులు అందరూ బాగానే ఉన్నా.. డబ్బులు కట్టిన బాధితులు మాత్రం వీధినపడ్డారు. ఇదే తరహాలో మరో భారీ ఆర్థిక నేరం వెలుగు చూసింది.
కలిగిరి మండలం కమ్మవారిపాళేనికి చెందిన ఆలూరి ప్రసాద్ అనే వ్యక్తి తన భార్య మాధవి, కుమార్తెతో కలిసి 2021లో మానస థియేటర్ సమీపంలో అద్దెకు దిగాడు. షేర్లు, తూర్పుగోదావరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు స్థానికులను నమ్మించాడు. లగ్జరీ లైఫ్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. షేర్లలో అధిక లాభాలు వస్తున్నాయంటూ పెట్టుబడుల పేరుతో స్థానికుల నుంచి భారీ మొత్తంలో వడ్డీకి నగదు తీసుకున్నాడు. రూ.100కు నెలకు రూ.7 నుంచి రూ.20 వడ్డీ చెల్లిస్తూ అతి తక్కువ కాలంలోనే రూ.కోట్లలో అప్పుల రూపంలో వసూలు చేశాడు. ఆ తర్వాత పాతూరుకు ప్రసాద్ కుటుంబం మకాం మార్చింది. అక్కడ కూడా కొత్త కార్లు, పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తూ పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నట్లు నమ్మించాడు. ప్రతి నెలా రెండు, మూడు రోజుల ముందే వడ్డీ డబ్బులు చెల్లిస్తుండటంతో స్థానికులు, పట్టణ ప్రజలతోపాటు చీరాల, కందుకూరు నుంచి కూడా బాధితులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఫిబ్రవరి రెండో వారం వరకూ చెల్లింపులు చేసిన ప్రసాద్ అనంతరం షేర్ మార్కెట్‌లో నష్టాలు వస్తున్నాయంటూ డబ్బులివ్వడం ఆపేశాడు. మోసపోయినట్లు గుర్తించి బాధితులు కావలి వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. వారు పది రోజుల నుంచి గోప్యంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
పాపం బాధితులు
కావలిలో టీస్టాల్ నడిపే వ్యక్తి స్నేహితులు, బంధువులతో కలిసి మొత్తం రూ.23 లక్షలు ప్రసాద్‌కు వడ్డీకి ఇచ్చినట్లు తెలిసింది. అదే విధంగా స్థానికంగా చిల్లర దుకాణం నిర్వహించే కుటుంబం రూ.32 లక్షల వరకూ ప్రసాద్‌కు పెట్టుబడుల రూపంలో ఇచ్చినట్లు సమాచారం. ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం రూ.25 లక్షల వరకూ కట్టినట్లు తెలిసింది. డబ్బులిచ్చిన వారికి ష్యూరిటీగా సంతకాలు చేసిన ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు.
కావలిలో మరో భారీ ఆర్థిక మోసం
షేర్లు, అధిక వడ్డీ పేరుతో
డబ్బు తీసుకున్న వ్యక్తి
ఫిబ్రవరి నెలాఖరు నుంచి
నిలిచిపోయిన చెల్లింపులు
లబోదిబోమంటున్న బాధితులు
షేర్ మార్కెట్‌లో బాగా లాభాలు వస్తుండటంతో అధిక వడ్డీ ఇస్తున్నానని ప్రసాద్ చెప్పడంతో నమ్మాను. ఇంట్లో ఉన్న బంగారం, బంధువుల బంగారం కుదువ పెట్టి రూ.21 లక్షలిచ్చాను. వడ్డీ డబ్బులివ్వక పోగా, అసలు కూడా ఇవ్వడం లేదు. రెండు నెలల నుంచి ప్రసాద్ సక్రమంగా ప్రవర్తించడం లేదు. భయం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశా. న్యాయం చేస్తామని చెప్పారు.
– పమిడిమర్రి నాగమణి, బాధితురాలు, కావలి

ఆశ పెట్టి.. నగదు వసూలు చేసి..

ఆశ పెట్టి.. నగదు వసూలు చేసి..

ఆశ పెట్టి.. నగదు వసూలు చేసి..