
శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు
నెల్లూరు(క్రైమ్): ‘జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. కేసుల్లో సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్షలు పడేలా చేయాలి’ అని ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీ బి.రాజకుమారి పోలీస్ అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఎస్పీ జి.కృష్ణకాంత్ నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐజీ రాజకుమారి సమావేశంలో పాల్గొన్నారు. స్టేషన్ల వారీగా గ్రేవ్, నాన్‌గ్రేవ్, పోక్సో, ఎస్సీ, ఎస్టీ, మహిళల కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్‌ఎస్‌లో పొందుపరచాలన్నారు. గ్రామాలను (విలేజ్ విజిట్) సందర్శించి ప్రజలతో మమేకమై సమాచార వ్యవస్థ పటిష్టం, ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాన్నారు. వేసవిలో దొంగతనాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలతో పాటు వాహన తనిఖీలు పెంచాలన్నారు. పోక్సో, లైంగికదాడి కేసుల్లో పక్కా సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించి నిందితులకు శిక్షలు పడేలా చూడాలన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులకు సంబంధించి ఫిర్యాదులపై అలసత్వం ప్రదర్శించరాదన్నారు. అనంతరం ఎస్పీ ఈగల్ టీమ్ ప్లకార్డులను ఆవిష్కరించి రేపటి తరం భవిష్యత్ మాకు ముఖ్యం.. డ్రగ్స్ రహిత రాష్ట్రం మా లక్ష్యం.. మనమందరం కలిసి పోరాడదామం.. మత్తుపదార్థాల వ్యసనం నుంచి మన పిల్లల్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
నేరస్తులకు శిక్ష పడేలా సమగ్ర విచారణ
ఐజీ రాజకుమారి