
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంపై సోనియా గాంధీ చాలా సానుకూలంగా ఉండేవారని, ఉద్యమం ఎంతటి తీవ్ర రూపం దాల్చినా బలప్రయోగం చేయవద్దని, కనీసం రబ్బరు బుల్లెట్లు కూడా ఉద్యమకారులపై ప్రయోగించకూడదని ఆమె కచ్చితమైన ఆదేశాలిచ్చారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి చెప్పారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డికి సోనియా గాంధీ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. సమైక్య రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలే తప్ప అణచివేతలు వద్దని ఆదేశించారన్నారు.
వైఎస్ దిగ్రేట్..
కాగా, తనకు విమానం ఎక్కడం ఇష్టం ఉండదని, అయినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆదేశాలతో ఒకసారి ఎక్కానని జగ్గారెడ్డి చెప్పారు. ఏ విషయాన్నయినా ఫాలోఅప్ చేయడంలో వైఎస్ దిగ్రేట్ అని, ఆయన సీఎం అవడానికి ఎంత కష్టపడ్డారో, అయ్యాక కూడా అంతే కష్టపడ్డారని చెప్పారు. వైఎస్ తనకు అప్పగించిన పనులను దిగ్విజయంగా పూర్తి చేయడం చాలా సంతోషానిచ్చేదని అన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో అలాంటి నాయకులు ఇప్పుడు లేకపోవడం దురదృష్టకరమని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని, ఉమ్మడి రాష్ట్రంలోనే తనకు మంత్రిపదవి ఆఫర్ చేసినా వద్దన్నానని చెప్పారు. కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి వస్తుందని, అందరూ కలసి పనిచేయాలని ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ తమకు దిశానిర్దేశం చేశారన్నారు.
సీఎల్పీ కార్యాలయానికి మంత్రి వేముల
ఆదివారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ సభ్యులు సభలోకి వెళ్లకపోవడంతో శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. లాబీల్లో నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని తీసుకుని ఆయన సీఎల్పీకి వచ్చారు. ఆ సమయంలో సీఎల్పీ నేత భట్టి, శ్రీధర్, వీరయ్యలు అక్కడే ఉన్నారు. దీంతో సభకు వచ్చి అసెంబ్లీ సమావేశాలు సజావుగా నడిచేందుకు సహకరించాలని ప్రశాంత్‌రెడ్డి వారిని కోరారు. శనివారం కేటీఆర్ మాట్లాడిన సందర్భంగా తమను జంతువులతో పోల్చడం బాధ కలిగించిందని, ఈ విషయంలో స్పీకర్‌ను కలుస్తామని చెప్పారు. కానీ, ప్రశాంత్‌రెడ్డి సర్దిచెప్పి వారిని సభలోపలికి తీసుకెళ్లడం గమనార్హం.