ఫేక్‌ ప్రచారంపై కోర్టుకెళ్దాం: సీఎం రేవంత్‌ | CM Revanth orders high-level review of Kancha Gachibowli land cases | Sakshi
Sakshi News home page

ఫేక్‌ ప్రచారంపై కోర్టుకెళ్దాం: సీఎం రేవంత్‌

Published Sun, Apr 6 2025 4:53 AM | Last Updated on Sun, Apr 6 2025 9:48 AM

CM Revanth orders high-level review of Kancha Gachibowli land cases

ఏఐతో నకిలీ ఫొటోలు, వీడియోలపై విచారణకు ఆదేశించాలని న్యాయస్థానాలను కోరదాం

కంచ గచ్చిబౌలి భూముల కేసులపై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైబర్‌ క్రైంను బలోపేతం చేయాలని స్పష్టీకరణ 

అధునాతన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ సమకూర్చుకోవాలని సూచన 

వర్సిటీ భూముల్ని లాక్కున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారంపై ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సృష్టించిన కంచ గచ్చిబౌలి భూముల వివాదం తరహాలో ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్‌ క్రైం విభాగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏఐతో తయారైన ఫేక్‌ కంటెంట్‌ను పసిగట్టేలా అధునాతన ఫోరెన్సిక్‌ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ను సమకూర్చుకోవాలని సూచించారు. సమాజాన్ని తప్పు దోవ పట్టించేలా ఉన్న ఫేక్‌ కంటెంట్‌ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 

కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టుల్లో ఉన్న కేసులపై సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయిలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ జితేందర్, పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం.డోబ్రియాల్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్‌ మీడియాలో కృత్రిమంగా వివాదం సృష్టించడంపై ఈ భేటీలో ఆందోళన వ్యక్తమైంది.  

ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా... 
‘ఏఐ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలు సృష్టించి కొందరు సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం చేయడంతో కంచ గచ్చి»ౌలి భూముల వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. వాస్తవాలు వెల్లడించేలోగా అబద్ధాలు సోషల్‌ మీడియాలో దేశమంతా వైరల్‌ కావడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లు ఆడియోలు, బుల్డోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీసినట్లు నకిలీ ఫొటోలు, వీడియోలు తయారు చేశారు. 

ప్రముఖులు సైతం వాటిని నిజమని నమ్మి సోషల్‌ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్లయింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ధ్రువ్‌ రాఠీ, సినీ ప్రముఖులు జాన్‌ అబ్రహం, దియా మీర్జా, రవీనా టండన్‌ లాంటి వాళ్లంతా ఫేక్‌ ఫొటోలు, వీడియోల పోస్టులను చేసి సమాజానికి తప్పుడు సందేశం చేరవేశారు. ఈ భూములపై తొలుత నకిలీ వీడియో పోస్ట్‌ చేసిన జర్నలిస్ట్‌ సుమిత్‌ జా కాసేపటికే పోస్టును తొలిగించి క్షమాపణ చెప్పారు. మిగతా ప్రముఖులెవరూ ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్‌ వీడియో ప్రచారం చేశారు’అని అధికారులు సీఎంకు వివరించారు.  

ఏఐతో ప్రజాస్వామ్య వ్యవస్థలకు ముప్పు: పోలీసులు 
‘కంచ గచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాల్‌ విసిరింది. భారత్‌–పాక్, భారత్‌–చైనా సరిహద్దుల్లో వివాదాలు, ఘర్షణలకు దారితీసేలా ఇదే తీరిలో సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్‌ కంటెంట్‌ సృష్టిస్తే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంటుంది. ఏఐతో తయారు చేసే ఫేక్‌ వీడియోలు, ఫొటోలు కరోనా వైరస్‌ను మించిన మహమ్మారి లాంటివి’అని పోలీసు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 



అప్పుడు లేని వివాదం ఇప్పుడెందుకు? 
‘కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబర్‌ 25లోని భూముల్లో గత 25 ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఐఎస్‌బీతోపాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు భవంతులు, అపార్టుమెంట్లు, హైదరాబాద్‌ యూనివర్సిటీ భవనాలు నిర్మించారు. వాటిని నిర్మించేటప్పుడు ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదు’అని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు కూడా లేవన్నారు. అలాంటప్పుడు అదే సర్వే నెంబర్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమైందన్న అంశం సమావేశంలో చర్చకు వచ్చింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement