
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధాన పత్రం రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి విద్యా కమిషన్‌ను ఆదేశించారు. శుక్రవారం ఆయన విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత వ్యయమైనా వెనుకాడమంటూ స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా విధానపత్రం ఉండాలని, అదే సమయంలో అది ఆచరణకు దూరంగా ఉండకుండా చూసుకోవాలని సీఎం సూచించారు.
విద్యా రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, ఉపాధ్యాయుల నియామకం, అమ్మ ఆదర్శ కమిటీలు, పుస్తకాలు, యూనిఫాంల పంపిణీతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వివరించారు. ప్రాథమిక దశలో అందే విద్యతోనే పునాది బలపడుతుందని.. ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తే ఉన్నత చదువుల్లో విద్యార్థులు మరింత మెరుగ్గా రాణించగలరని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.
అంగన్‌వాడీలు, ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావల్సిన మార్పులపై సమాజంలోని వివిధ సంఘాలు, ప్రముఖులతో చర్చించి మెరుగైన విధాన పత్రం రూపొందించాలని సీఎం సూచించారు. వనరులు సద్వినియోగం చేసుకోవాలని, విద్యా వ్యవస్థలో తెలంగాణ అగ్రగామిగా ఉండేందుకు దోహదపడేలా సూచనలు, సలహాలు ఉండాలని సీఎం సూచించారు. వివిధ రాష్ట్రాల్లోని పర్యటనలు, ఆయా రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ప్రాథమిక విద్యలో అనుసరిస్తున్న విధానాలను విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
1960 దశకం నుంచి ప్రస్తుతం వరకు విద్యా వ్యవస్థలోని తీసుకువచ్చిన పలు సంస్కరణలు క్రమేణా విద్యార్థుల సృజనాత్మక శక్తి, ఆలోచనాధోరణిని ఎలా హరించి వేశాయో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ వివరించారు. విద్యా వ్యవస్థలో మార్పులకు పరీక్షల విధానం, పాఠశాలల్లో తనిఖీలు, జీవన నైపుణ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను ఆయన సూచించారు.