సాక్షి,హైదరాబాద్: 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సుదీర్ఘ లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారి ప్రతి పైసాకు రక్షణ కల్పిస్తామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా.. అన్ని ప్రాంతాల్లో జరగాలని సూచించారు. తమది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానమని.. హైదరాబాద్ తరహా రాష్ట్రమంతటా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలన్నారు రేవంత్. అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సహం అందిస్తామన్నారు.
తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని తెలిపారు. అర్బన్ క్లస్టర్, సెమీ అర్బన్ క్లస్టర్, రూరల్ క్లస్టర్లుగా పారిశ్రామిక క్లస్టర్‌లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ప్రాంతం అర్బన్ క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్-ఆర్ఆర్‌ఆర్ మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్, ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ప్రాంతమంతా రూరల్ క్లస్టర్‌గా విభజించనున్నట్లు సీఎం చెప్పారు. ఎన్నికలు వేరు, రాజకీయాలు వేరు, పారిశ్రామిక విధానం వేరని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు.
భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులతో సమీక్ష
హైదరాబాద్‌కు నలువైపులా జనావాసాలకు దూరంగా నాలుగు డంప్ యార్డులు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష చేపట్టారు. హైదరాబాద్ నగరం మొత్తానికి జవహర్‌నగర్ డంప్ యార్డు ఒక్కటే ఉండడం వల్ల ఆ ప్రాంతంలో వాయు, నీటి కాలుష్యం జరుగుతోందని అన్నారు. చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. గచ్చిబౌలి టూ ఏయిర్‌పోర్టుకు మెట్రో అంత ఉపయోగకరంగా ఉండదని తెలిపారు.
గౌలిగూడ, ఫలక్నామ, ఏయిర్‌పోర్టు రూట్‌లో మెట్రో వేస్తామని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 55 కిలోమీటర్ల మేరా మెట్రో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. చార్మినార్, గోల్కొండ, తారామతి బారామతి వంటి వాటిని కలుపుకుని టూరిజం సర్క్యూట్ యూనిట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ (పీపీపీ) మోడల్‌లో పెట్టుబడులు పెడతామని తెలిపారు. మూసీ నదిపై చెక్ డ్యాంలు నిర్మించి, వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.
సీఎం ఆఫీసు మార్పు!
తెలంగాణ డా.అంబేద్కర్ సచివాలయంలో 6వ అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 9వ అంతస్తుకు మార్చుకునే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 9వ అంతస్తును సీఎం రేవంత్ పరిశీలించారు. 9వ అంతస్తులో ఆఫీసుకు జీఏడీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9 కావడంతో 9వ అంతస్తుకు తన ఆఫీసును మార్చుకుంటుంన్నారంటన్నాయి సచివాలయ వర్గాలు.
చదవండి: రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment