
ధరణి దరఖాస్తుల పరిష్కారంలో క్షేత్రస్థాయి నిర్లిప్తత ఎందుకు?
10 రోజుల్లో సరైన పద్ధతిలో పరిష్కరించకపోతే చర్యలు తీసుకుంటాం
దరఖాస్తు పరిష్కారానికి, మాన్యువల్ రికార్డుకు లింకు పెడితే సస్పెండ్ చేయండి
ధరణి దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్‌ఏ నవీన్ మిత్తల్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ‘ఒక జిల్లాలో పెండింగ్ మ్యుటేషన్ దరఖాస్తులు 800 వరకు ఉన్నాయి. కానీ, గత నెల రోజుల నుంచి 30 అప్లికేషన్లు కూడా ప్రాసెస్ చేయలేదు. క్షేత్రస్థాయి అధికారులు ఏం చేస్తున్నట్టు? ధరణి పోర్టల్ కింద వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారం ప్రభుత్వ ప్రాధాన్యత అని చెబుతున్నా క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు ఎందుకు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. సరిగా పనిచేయని అలాంటి అధికారులను మీరు సస్పెండ్ చేయండి... లేదంటే నేనే సస్పెండ్ చేస్తా’అని శనివారం జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్ మిత్తల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ అధికారుల వైఖరిలో మార్పు రావాలని, 10 రోజుల్లో సరైన పద్ధతిలో ధరణి దరఖాస్తులు పరిష్కరించకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్టు సమాచారం. అదేవిధంగా దరఖాస్తు పరిష్కారానికి, మాన్యువల్ రికార్డుకు లింకు పెట్టవద్దని, వీలున్నంత మేర ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు డిస్పోజ్ చేయాలని, మాన్యువల్ రికార్డు లేదంటూ ధరణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిన వారిని సస్పెండ్ చేయాలని స్పష్టం చేసినట్టు తెలిసింది.
జిల్లా కలెక్టర్లతో రెండు విడతల్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ల్లో ఎన్‌ఆర్‌ఐ పాసు పుస్తకాలు, కోర్టు కేసులు, డేటా కరెక్షన్లు, నిషేధిత జాబితాలోని భూములు, కొత్త పాసు పుస్తకాల జారీ, నాలా, ఖాతాల విలీనం తదితర అంశాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన పరిష్కార మార్గాలపై మిత్తల్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బందికి తగిన సూచనలు చేశారు.
గత 15 రోజుల్లో...
ధరణి దరఖాస్తుల పురోగతిపై ఈనెల 14న నవీన్ మిత్తల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మళ్లీ వీడియో కాన్ఫరెన్స్ నాటికి గత 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25వేల దరఖాస్తులు పరిష్కారయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 3,779 దరఖాస్తులు, నల్లగొండలో 2,120, సిద్ధిపేటలో 1,880, నాగర్‌కర్నూల్‌లో 1,800 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. అయితే, అత్యల్పంగా భూపాలపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో 100 దరఖాస్తులు కూడా క్లియర్ కాలేదు. భూపాలపల్లిలో 65, సిరిసిల్లలో 97, కొత్తగూడెం జిల్లాలో 144 దరఖాస్తులు మాత్రమే గత 15 రోజుల వ్యవధిలో పరిష్కారమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి.
1.50 లక్షలు తహశీల్దార్ల వద్దనే..
15 రోజుల క్రితం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ధరణి దరఖాస్తుల పరిష్కార పురోగతి ప్రక్రియను పరిశీలిస్తే మొత్తం 2,59,404 దరఖాస్తులకుగాను 24,778 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. మిగిలిన 2.34 లక్షల దరఖాస్తుల్లో మెజార్టీ దరఖాస్తులు తహశీల్దార్ల వద్దనే పెండింగ్‌లో ఉండటం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో సుమారు 60 శాతం అంటే 1.48 లక్షల దరఖాస్తులు క్షేత్రస్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
ఇక, ఆర్డీవోల వద్ద మరో 20 శాతం అంటే 50 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతోనే మిత్తల్ కలెక్టర్ల సమావేశంలో తహశీల్దార్లు, ఆర్డీవోలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తంమీద అదనపు కలెక్టర్ల వద్ద 20వేల పైచిలుకు, కలెక్టర్ల స్థాయిలో 12 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ దరఖాస్తులు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 36,463 ఉండగా, ఆ తర్వాత నల్లగొండలో 21,693 ఉన్నాయి. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 1,410, భూపాలపల్లిలో 1,826 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉండటం గమనార్హం.
పెండింగ్ దరఖాస్తులు ఏ స్థాయిలో ఎన్ని?
తహశీల్దార్ల వద్ద: 1,48,182
ఆర్డీవోల వద్ద: 53,478
అదనపు కలెక్టర్ల వద్ద: 20,461
కలెక్టర్ల వద్ద: 12,505
మొత్తం పెండింగ్ దరఖాస్తులు: 2,34,626