
ఖైదీలకు విద్యాబుద్ధులు నేర్పుతున్న జైళ్ల శాఖ
బీఏ, ఎంఏ, ఎమ్మెస్సీ సైకాలజీ పూర్తి చేసిన పలువురు ఖైదీలు
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీతో జైళ్లశాఖ ఎంఓయూ
ఎన్‌ఐఓఎస్‌తో పాఠశాల విద్యపై ఒప్పందం
అక్షరాస్యత కోసం‘థంబ్ ఇన్.. సైన్ ఔట్’కార్యక్రమం
2024లో 15,896 మందికి కనీస విద్య నేర్పినఅధికారులు
నేరం చేసిన వ్యక్తిలో పరివర్తన తీసుకురావటమే జైలు శిక్ష ప్రధాన ఉద్దేశం. ఈ లక్ష్యాన్ని ‘అక్షరాలా’నిజం చేస్తోంది తెలంగాణ జైళ్లశాఖ. దారితప్పిన వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ‘శిక్ష’ణ ఇస్తోంది. నిరక్షరాస్యులుగా జైలుకు వచ్చే ప్రతి ఖైదీ కనీసం తన పేరు రాయటం నేర్చుకుని సంతకం పెట్టేలా విద్య నేర్పుతున్నారు. ఆసక్తి ఉన్న ఖైదీలను పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ వరకు పూర్తిచేసేలా ప్రోత్సహిస్తున్నారు.
తెలంగాణ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సౌమ్యా మిశ్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఖైదీల విద్యాభ్యాసానికి కీలక చర్యలు చేపట్టారు. ఖైదీలు పాఠశాల స్థాయి విద్యను పూర్తిచేసేలా మొదటిసారి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్)తో ఇటీవలే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
థంబ్ ఇన్...సైన్ ఔట్..
జైలుకు వచ్చే ప్రతి ఖైదీ కనీస విద్య నేర్చుకోవాలన్న ఉద్దేశంతో జైళ్లశాఖ ‘థంబ్ ఇన్..సైన్ ఔట్’కార్యక్రమాన్ని చేపట్టింది. నిరక్షరాస్యులైన ఖైదీలకు చదవడం, రాయడం నేర్పడం దీని ప్రధాన ఉద్దేశం. వేలిముద్ర వేసే స్థితిలో జైలుకు వచ్చే ఖైదీ.. శిక్ష పూర్తిచేసుకొని వెళ్లేటప్పుడు సంతకం పెట్టి వెళ్లాలనేది ఈ కార్యక్రమ లక్ష్యం.
ప్రతి ఖైదీ జైలు లోపలికి రాగానే అడ్మిషన్ (జైలులో చేర్చే సమయం) సమయంలో వారి వివరాలు నమోదు చేస్తారు. ఆ రికార్డుల్లో ఎవరైనా ఖైదీ వేలిముద్ర వేస్తే.. వెంటనే వారి వివరాలు ప్రత్యేకంగా నమోదు చేసుకుని థంబ్ ఇన్..సైన్ ఔట్‌లో చేర్చి విద్య నేర్పుతారు. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో కలిపి 2024లో 15,896 మంది ఖైదీలు ఈ ప్రాథమిక విద్యా కార్యక్రమం నుంచి ప్రయోజనం పొందారు.
ఎన్‌ఐఓఎస్ కింద 106 మందికి శిక్షణ
ఐదు, ఆరో తరగతి తర్వాత చదువు మానేసిన ఖైదీలు 10వ తరగతి పూర్తి చేసేలా ఎన్‌ఐఓఎస్‌లో శిక్షణ ఇస్తున్నారు. వారికి పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అన్నీ జైళ్లశాఖనే సమకూరుస్తోంది. కనీసం రెండేళ్ల శిక్షాకాలం ఉన్న ఖైదీలకు పదో తరగతి పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఎన్‌ఐఓఎస్ కింద చర్లపల్లి, నిజామాబాద్ సెంట్రల్ జైళ్లు, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లా జైళ్లు, హైదరాబాద్ మహిళా ప్రత్యేక జైలులో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 106 మంది ఖైదీలకు ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్షలు రాసేలా శిక్షణ కొనసాగుతోంది. - సాక్షి, హైదరాబాద్
ప్రత్యేక టీచర్లతో తరగతులు
జైళ్లలో ఖైదీలకు చదువు చెప్పేందుకుప్రత్యేక టీచర్లను నియమించారు. చర్లపల్లి,చంచల్‌గూడల్లో ఒక్కరు చొప్పున రెగ్యులర్ టీచర్లు ఉన్నారు. జిల్లా జైళ్లలో స్థానిక కలెక్టర్ల సహకారంతో ఔట్ సోర్సింగ్ విధానంలో టీచర్లను నియమించారు. జీవిత ఖైదు, ఎక్కువ కాలం శిక్ష పడిన ఖైదీల్లో డిగ్రీ, ఆపై విద్యార్హతలుఉన్నవారితో కూడా ఇతర ఖైదీలకుశిక్షణ ఇస్తున్నారు.
అందుబాటులో గ్రంథాలయాలు
విద్యార్హత, శిక్షా కాలాన్ని బట్టి ఖైదీలు వారికి నచ్చిన కోర్సులు చేసేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. డిగ్రీ, పీజీ కోర్సులను అందించేందుకు చర్లపల్లి సెంట్రల్ జైలులో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ప్రత్యేక అధ్యయన కేంద్రాన్ని స్థాపించారు. బీఏ, ఎంఏ, ఎంఎస్సీలో విద్య అందిస్తున్నారు. జైళ్లలోనే వారికి పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని జైళ్లలోగ్రంథాలయాలు సైతంఅందుబాటులో ఉన్నాయి. రోజులో కొంత సమయం పుస్తకాలు చదివేందుకు ఖైదీలకు అవకాశం కల్పిస్తున్నారు.
ఖైదీల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకే..
జైలుకు వచి్చన తర్వాత ఖైదీలు ఖాళీగా ఉంటే వారిలో డిప్రెషన్, నేర ఆలోచనలు పెరుగుతాయి. అందుకే వారి దృష్టిని చదువు వైపు మళ్లిస్తున్నాం. విద్యార్హత పెంచుకోవడంతో ఖైదీల్లోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చదువు వారిలో మెంటల్ కంట్రోల్ పెంచుతుంది. తప్పుచేసి జైలుకు వచ్చినా.. విద్యార్హత కలిగిన మంచి పౌరులుగా తిరిగి సమాజంలోకి వెళతారు. ఏదైనా ఉపాధి దొరికేలా ఇది ఉపయోగపడుతుంది. –సౌమ్యా మిశ్రా, డీజీ, జైళ్లశాఖ
2014 నుంచి ఇప్పటివరకుజైళ్లలో ఖైదీల చదువు వివరాలు:
బీఏ 118
ఎమ్మెస్సీ సైకాలజీ 35
ఎంఏ 16