
జాతీయ స్థాయిలో సగటున ఉండాల్సింది..197 మంది, జాతీయ సరాసరిన 155కి మించని సంఖ్య
తెలంగాణ పోలీస్‌శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య 8.7 శాతం, అధికారులు 7.6 శాతం మంది
వెల్లడించిన ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులది అత్యంత కీలకపాత్ర. నేరాలు జరగకుండా చూడడంతోపాటు నేరస్తులను చట్టం ముందు నిలబెట్టేలా దర్యాప్తు చేయడం వీరి ప్రధాన విధి. అయితే దేశవ్యాప్తంగా పోలీసుల సంఖ్యకు నానాటికీ పెరుగుతున్న జనాభాకు పొంతన లేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మంది జనాభాకు కేవలం 155 మంది పోలీసులు మాత్రమే ఉన్నట్టు ఇటీవల విడుదలైన ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్)–2025 నివేదిక వెల్లడించింది. – సాక్షి, హైదరాబాద్
⇒ జాతీయ స్థాయిలో సరాసరిన చూస్తే ప్రతి లక్ష మంది జనాభాకు మంజూరైన పోలీసుల సంఖ్య 197 కాగా, కేవలం 155 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు.
⇒ తెలంగాణ విషయానికి వస్తే ప్రతి లక్ష మంది జనాభాకు ఇక్కడ 233 మంది పోలీసులు అందుబాటులో ఉన్నారు.
⇒ ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ప్రతి లక్ష మందికి బిహార్‌లో అత్యల్పంగా కేవలం 75 మంది పోలీసులు మాత్రమే అందుబాటులో ఉన్నారు.
మహిళా పోలీసుల సంఖ్య అంతంతే..
⇒ పోలీస్ బలగాల్లో మహిళా అధికారులు, సిబ్బంది సంఖ్య సైతం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు.
⇒ జాతీయ స్థాయిలో పోలీస్ విభాగాల్లో మహిళా సిబ్బంది సంఖ్య 8 శాతంగా ఉండగా..మహిళా అధికారుల సంఖ్య 10 శాతానికి పరిమితమైంది.
⇒ తెలంగాణ పోలీస్‌శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తూ మహిళల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది. అయితే ఐజేఆర్ 2025 నివేదిక ప్రకారం తెలంగాణ పోలీస్‌శాఖలో మహిళా సిబ్బంది 8.7 శాతంగా, మహిళా అధికారుల సంఖ్య 7.6 శాతంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.
⇒ దేశవ్యాప్తంగా అత్యధికంగా తమిళనాడు పోలీస్‌శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య 20.7 శాతంగా, మహిళా అధికారుల సంఖ్య 20.1 శాతంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది.