
Slbc Tunnel Rescue Operation Updates:
👉జీపీఆర్, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు రెస్క్యూ ఆపరేషన్‌లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంటున్నారు.
👉ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్ ఎండ్ పాయింట్‌లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్‌లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.
👉కాగా, ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు.

👉కన్వేయర్ బెల్ట్ పూర్తిగా మరమ్మతు జరగడంతో.. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం విడిభాగాలు (ఇనుము), ఊడిపోయిన కాంక్రీట్ సెగ్మెంట్లను తొలగించే రోబోలు తయారు చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోబోలు సాయం వారం రోజుల తర్వాతే వినియోగంలోకి వస్తోంది.
👉ప్రమాదం జరిగిన సొరంగంలో పరిశోధన చేసేందుకు కేరళ నుంచి వచ్చిన కాడవర్ డాగ్స్ కూడా ఇది వరకు గుర్తించిన డాగ్స్ స్థానాల్లోనే గుర్తించాయి. 13.500 కి.మీ., అవుతల ఒకే దగ్గర ముగ్గురు వ్యక్తుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారించాయి. కారి్మకులు చిక్కుకున్నట్లు డాగ్స్ చూపించిన ప్రదేశాల్లో శనివారం రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభించాయి. టీబీఎం పరికరాలు గ్యాస్ కట్టర్‌తో కత్తిరించి లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటికి పంపించారు. కూలిపడిన పైకప్పు మట్టి దిబ్బలను హిటాచీతో ఒకవైపు తరలిస్తున్నారు. రోజుకో బృందాన్ని సింగరేణి నుంచి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. సొరంగంలో వస్తున్న దుర్వాసన సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిస్తోంది.

👉టన్నెల్‌లో జరిగిన ప్రమాదం జాతీయ విపత్తు అని, అందులో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికత ఉపయోగిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం టన్నెల్‌ను సందర్శించిన ఆయన రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

👉సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జరిగిన పురోభివృద్ధి గురించి రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి అరవింద్‌కుమార్, ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సహాయక చర్యల్లో అవంతరాలను అధిగమిస్తూ వేగంగా ముందుకెళ్తున్నామని, సొరంగం లోపల ఆక్సిజన్ సరిగా లేకపోవడం, నీటి ఊట అధికంగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.

👉టీబీఎం దృఢమైన లోహ శకలాలు, రాళ్లు, మట్టితో కూరుకుపోయి ఇబ్బందులు ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృతనిత్చయంతో ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పనిచేసే కారి్మకులకు, అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మిలటరీ ఇంజినీర్ వికాస్‌సింగ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ కమాండెంట్ ప్రసన్నకుమార్, ఎస్‌డీఆర్‌ఎఫ్ కమాండెంట్ ప్రభాకర్, సింగరేణి, రైల్వే, ఎన్‌జీఆర్‌ఐ, హైడ్రా తదితర బృందాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.