
సచివాలయంలో కంప్యూటర్లు, ఫోన్లు, టీవీల కొనుగోలుకు చెల్లింపు
బిల్లుల్లేకుండానే నిధులు విడుదల చేసిన గత సర్కారు
సర్కార్‌కు విజిలెన్స్ ప్రాథమిక నివేదిక
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయంలో ఏర్పాటు చేసేందుకు పలు ఎల్రక్టానిక్ పరికరాల కొనుగోలుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.320 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రభుత్వానికి ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. ఈ రూ. 320 కోట్ల విడుదలకు ఆధారాలు లేవని తేల్చింది. పరికరాల కొనుగోలులో నిబంధనలు పాటించలేదని, బిల్లులు లేకుండానే నిధులు విడుదల చేశారని పేర్కొన్నట్టు తెలిసింది.
సచివాలయ నిర్మాణంలో అవినీతిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడం తెలిసిందే. దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్.. ఐటీ విభాగంపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. నిర్మాణ సంస్థకు ఇప్పటివరకు సెక్రటేరియట్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం సదరు సంస్థకు పరికరాల కొనుగోలు కోసమే రూ.500–600 కోట్ల వరకు విడుదల చేసినట్టు విజిలెన్స్ తేల్చింది.