
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి నుంచి మూడు డిగ్రీల మేర అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని పేర్కొంది.

కోస్తా ఆంధ్ర తీరం, యానాం పరిసరాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. రాష్ట్రానికి తూర్పు ప్రాంతంలోని జిల్లాల్లో వడగాలులు వీచేఅవకాశం ఉందని తెలిపారు.