
బోర్ల చుట్టూ వాననీటి రీచార్జ్ కట్టడాలతో రైతుల నీటికష్టాలకు చెల్లు
తెలుగు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు నోరెళ్ల బెడుతున్నాయి. పంటలు, తోటలు కళ్లు తేలేస్తున్నాయి. మరో మూడు నెలలు ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతూనే ఉంది. ఈ కష్టకాలంలో అడపాదడపా పలకరించే అకాల వర్షాలు రైతులకు కొంత మేరకు ఉపశమనం కలిగిస్తున్నాయి. రెండు రోజులు గడిస్తే నీటికష్టాలు షరా మామూలే. అయితే, ఈ అకాల వర్షపు నీటిని పొలాల్లో ఎక్కడికక్కడే ఒడిసిపట్టి భూమిలోకి ఇంకింపజేసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
ఎండిపోయిన /ఎండిపోతున్న బోర్ల చుట్టూ ఇంకుడు గుంతలు కట్టుకుంటే ఆ బోర్లు ఎండిపోకుండా ఉంటాయి. అవి తిరిగి జలకళను సంతరించుకుంటాయి. వర్షం కురిసిన రోజే ఆ బోర్లలో అప్పటికప్పుడే నీటిలభ్యత పెరుగుతుందని సీనియర్ హైడ్రాలజిస్ట్, సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాటర్ అండ్ లైవ్‌లీహుడ్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌వి.రాంమోహన్‌అనుభవపూర్వకంగా చెబుతున్నారు. పన్నెండేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో వేలాది బోర్లను రీచార్జ్ చేసిన అనుభవంతో ఆయన ‘సాక్షి సాగుబడి’కి అనేక విషయాలు చెప్పారు. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఏమిటి?
గ్రామీణ ప్రాంతాల్లో వేలాది వ్యవసాయబోర్లు ఎండిపోయి ఉన్నాయి. కొన్నిచోట్ల తక్కువ నీటిని పో స్తూ ఉన్నాయి. కొత్త బోర్లు తవ్వకుండా ఇప్పటికే ఉన్న ఎండిపోయిన లేదా ఎండిపోతున్న బోరుబా వుల చుట్టూ వాననీటి రీచార్జ్ కట్టడాలు నిర్మించాలి. తద్వారా చిన్న, సన్నకారు రైతులకు అందుబా టు ఖర్చుతోనే నీటి భద్రత కల్పించొచ్చు.
ఎప్పుడు?
బోరు లోపలికి ట్యాంకర్‌తో తెచి్చన నీటిని పోసి.. దానికి వాననీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యం ఉందో లేదో టెస్ట్ చేయాలి. దీన్నే ట్యాంకర్ టెస్ట్ అంటారు. కేవలం కొన్ని వందల రూపాయల ఖర్చుతో రైతులు సొంతంగా తమ బోరుబావులను పరీక్షించుకోవచ్చు. వానాకాలం ప్రారంభం కాక ముందు ఫిబ్రవరి–మే నెలల మధ్య రోజులు ఇందుకు అనువైన కాలం.
ఎక్కడ?
కొన్ని పొలాల్లో ఒకటి కన్నా ఎక్కువ బోర్లు ఉండొచ్చు. అలాంటప్పుడు అన్ని బోర్లకు ‘ట్యాంకరు టెస్ట్’చేయాలి. వాటి వాస్తవిక రీచార్జ్ సామర్థ్యం ఎంత అనేది కచ్చితంగా తెలుస్తుంది. లోతు తక్కువ ఉన్న బోరుబావిని రీచార్జ్ కోసం ఎంపిక చేసుకుంటే రీచార్జ్ కట్టడం ద్వారా ఆ పక్కనున్న ఇతర బోరుబావుల్లో కూడా నీరు పెరిగే అవకాశం ఉంటుంది.
ఎందుకు?
వర్షాధార వ్యవసాయ ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయిన ప్రతిసారీ కొత్త బోర్లు వేయటం ఆర్థికంగా కష్టంతో కూడుకున్న పని. అందుకని బోరుబావులకే వాననీటిని తాపే పనిచేయడం ఉత్తమం. ఇందుకోసం బోరుబావుల చుట్టూ వాన నీటి రీచార్జ్ కట్టడాలు నిర్మించుకోవాలి. ఇవి దీర్ఘకాలం (కనీసం 8–10 ఏళ్లు) పాటు రైతులకు ప్రయోజనాలు అందించగలుగుతాయి. బోరు రీచార్జ్ సాంకేతికతను ఉపయోగించి, రెండు వానాకాలపు సీజన్లలోనే ఎండిపోయిన బోరు బావులను పునరుద్ధరించుకోవచ్చు.
ఎలా?
బోరు రీచార్జ్ నిర్మాణానికి స్థానికంగా దొరికే రాళ్లు, ఇసుక, సిమెంట్ వంటి సామగ్రిని వాడుకొని 7–10 రోజుల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేయొచ్చు. కొత్తగా బోరుబావి తవ్వడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే.. తక్కువ ఖర్చులోనే ఎండిన బోరుబావులను పునరుద్ధరించొచ్చు. కొత్తగా తవ్వే బోరు పడకపోతే ఆ ఖర్చు అంతా వ్యర్థమే. ఎగువన ఉండే నీటి పరీవాహక ప్రాంతాల నుంచి సంగ్రహించే వాననీటిలో గరిష్టంగా 50% నీరు రీచార్జ్ అవుతుంది (చెక్‌డ్యాం, నీటికుంటల ద్వారా 10–15% నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతుంది). ఈ పద్ధతిలో వాననీటిని రీచార్జ్ చేస్తూనే ఆ బోరుబావి నుంచి నీటిని పంటలకు వాడుకునే వెసులుబాటు ఉంది.
ఎవరు?
బోరుబావి ద్వారా వాననీటిని నేలలోకి ఇంకించి భూగర్భ నీటిని మరింతగా రీచార్జ్ చేసే సాంకేతిక ప్రక్రియలో ఆర్‌వి.రాంమోహన్‌ది అందెవేసిన చేయి. 2012 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో నీటి కష్టాలకు పరిష్కారంగా బోరుబావుల చుట్టూ రాళ్లు రప్పలు, గులక రాళ్లు, ఇసుకతో ఇంకుడు గుంతలు నిర్మించుకోవటంలో రైతులకు, పట్టణవాసులకు చేదోడుగా ఉంటున్నారు. ఇప్పటికి వెయ్యి బోర్ల రీచార్జ్‌కు ఇంకుడుగుంతలను నిర్మించటంలో ప్రత్యక్షంగా తోడ్పాటునందించారు.
మరో మూడు, నాలుగు వేల బోరు రీచార్జ్ పిట్ల నిర్మాణానికి పరోక్షంగా సాంకేతికతంగా సాయపడ్డారు. ఈ క్రమంలో రైతుల అభిప్రాయాలు, సలహాలు సూచనల మేరకు ఈ సాంకేతికతలో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేశారు. ఈ అనుభవ జ్ఞానంతో ‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బోరుబావుల పునరుద్ధరణ (అక్విఫెర్ రీచార్జ్)’పేరిట శిక్షణ కరదీపికను ప్రచురించారు.
