అమెరికా సంబంధమా.. అసలే వద్దు! | Trump effect on American marriages | Sakshi
Sakshi News home page

అమెరికా సంబంధమా.. అసలే వద్దు!

Published Tue, Apr 22 2025 6:07 AM | Last Updated on Tue, Apr 22 2025 2:25 PM

Trump effect on American marriages

అమెరికా పెళ్లి సంబంధాలపై ట్రంప్‌ ఎఫెక్ట్‌  

వీసా కష్టాలతో వెనకడుగు వేస్తున్న కుటుంబాలు 

నిర్ణయమైన సంబంధాలూ రద్దు చేసుకుంటున్న వైనం 

మళ్లీ స్థానిక సంబంధాలకు పెద్ద పీట  

సొంత ఊళ్లో ఆస్తిపాస్తులు ఉంటే చాలనే అభిప్రాయం  

‘అగ్రరాజ్యంలో ఉద్యోగం. డాలర్లలో జీతం, పెళ్లయితే ఇద్దరూ కలిసి బాగా సంపాదిస్తారు. కార్లు, బంగళాలు అన్నీ వచ్చేస్తాయి. పిల్లలు అమెరికా పౌరులవుతారు. సొంత ఊళ్లో ఏమున్నా లేకపోయినా అమెరికాలో ఉద్యోగం ఉంటే చాలదా? బంగారంలాంటి అమెరికా సంబంధాన్ని వదులుకోవడం కంటే మూర్ఖత్వం మరొకటి ఉంటుందా?’.. నిన్నమొన్నటి వరకు తెలుగువాళ్లలో అమెరికా సంబంధాలపై ఉన్న అభిప్రాయమిది.

ఇప్పుడు అమెరికా పేరెత్తితేనే బాబోయ్‌ మాకొద్దు ఆ సంబంధం అంటున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి రావడానికి ముందు, తరువాత అన్నట్లుగా అమెరికా పెళ్లి సంబంధాల పరిస్థితి తయారైంది. ట్రంప్‌ ఆంక్షలకు ముందు కుదుర్చుకున్న పెళ్లి సంబంధాలు సైతం రద్దవుతున్నాయి. మధ్యతరగతి వర్గాల నుంచి సంపన్న కుటుంబాల వరకు ఇదే పరిస్థితి ఉంది.     – సాక్షి, హైదరాబాద్‌

ఈ అనిశ్చితి మరో రెండేళ్లు ఉండొచ్చు  
ఇది ఒకవిధంగా కష్టకాలమే. ఈ అనిశ్చితి మరో రెండేళ్లు ఉంటుందేమో అనిపిస్తోంది. ఏదో ఒక పరిణామం జరిగి ట్రంప్‌ మారితే తప్ప ఇప్పట్లో పరిస్థితులు మారుతాయని భావించలేము. – హిమబిందు, కాన్వోకేషన్స్‌స్కే్వర్, ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీ.

అంతులేని వీసా కష్టాలు
ఆ అబ్బాయి షికాగోలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాది క్రితం హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన ఒక అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. గత నెలలో పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు భావించాయి. కానీ డిపెండెంట్‌ వీసాలపై అమెరికా ఆంక్షలు విధించటంతో ఇప్పుడు ఆ కుటుంబాలు పునరాలోచనలో పడ్డాయి. ‘చేసుకుంటే అమెరికా అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి’అని కలలుగన్న ఆ అమ్మాయి ఇప్పుడు ‘ఏ హైదరాబాదీ అయినా సరే పెళ్లికి రెడీ’అంటోంది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన భార్యాభర్తలు కొంతకాలంగా అమెరికాలోని ఒహాయోలో ఉంటున్నారు. భర్తకు హెచ్‌–1 వీసా ఉంది.

హెచ్‌–4 వీసాపై రెండేళ్ల క్రితం భార్యను తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత ఆమె రెండుమూడు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నట్లు ప్రభుత్వం వద్ద నమోదు చేసుకుంది. ఇటీవల సొంత ఊరుకు వచ్చిన ఆ జంట తిరిగి అమెరికాకు వెళ్లారు. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఎయిర్‌పోర్టులోనే ఆమెను నిలిపివేసి, ఉద్యోగాల గురించి ఆరా తీశారు. ఆమె పనిచేస్తున్నట్లు చెప్పిన కంపెనీల హెచ్‌ఆర్‌ విభాగాలు ఆ విషయాన్ని ధ్రువీకరించకపోవడంతో ఆమె వీసాను ఫ్రీజ్‌ చేశారు. గత్యంతరం లేక ఆమె భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు కూడా వీసాలు రద్దయిపోతున్న పరిస్థితి ఉంది. 

ట్రంప్‌ ఆంక్షలు ప్రారంభమైన తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు రెండున్నర నెలల్లోనే సుమారు వేయి మంది తెలుగువాళ్లు వివిధ కారణాలతో వెనుదిరిగి విచ్చినట్లు హైదరాబాద్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు కొత్తగా వీసాల దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ఆశలు వదిలేసుకున్నారు. ఈ అనిశ్చితి కారణంగా పెళ్లి సంబంధాలు రద్దుకావడం, వాయిదా వేసుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అమీర్‌పేట్‌లో ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న హిమబిందు తెలిపారు. అమెరికా సంబంధాల కోసం మ్యారేజ్‌ బ్యూరోల్లో దరఖాస్తు చేసుకున్నవాళ్లు సైతం విరమించుకుంటున్నట్లు చెప్పారు.

అమెరికా పౌరులైతేనే భద్రత 
చాలాకాలంగా అమెరికాలో ఉండి గ్రీన్‌కార్డుదారులుగా స్థిరపడ్డవాళ్లకు కూడా ఇప్పుడు భద్రత లేకుండా పోయింది. సాధారణంగా ఏడేళ్లకు పైగా అక్కడ ఉంటే గ్రీన్‌కార్డు లభించే అవకాశం ఉంది. కానీ ఏడెనిమిదేళ్ల తరువాత వివిధ కారణాల వల్ల తిరిగి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడుతున్నవాళ్లు ఇప్పుడు తమ గ్రీన్‌కార్డులను వదులుకోవాల్సి వస్తోంది.

సాధారణంగా గ్రీన్‌కార్డుదారులు తమ గుర్తింపును కొనసాగించాలంటే అమెరికాలోనే ఉంటున్నట్లు నమోదు కావాలి. అందుకో సం ప్రతి 6 నెలలకు ఒకసారి అమెరికా వెళ్లి వస్తారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఇలాంటివారి గ్రీన్‌కార్డులను కూడా రద్దు చేస్తుండటంతో భద్రత లేకుండా పోయింది. అమెరికా పౌరసత్వం కలిగిన వాళ్లకు మాత్రమే ఇప్పుడు పూర్తి భద్రత ఉందని హిమబిందు తెలిపారు. అలాంటి కుటుంబాల్లో సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడానికి కొంత అవకాశాలు ఉన్నాయి.  

పాతకాలపు ‘నయా’ట్రెండ్‌
డాలర్‌ డ్రీమ్స్‌ కరిగిపోవటంతో పెళ్లి సంబంధాల్లో పాతకాలపు పద్ధతులకు మళ్లీ పెద్దపీట వేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం, పెద్ద చదువుల జోలికి వెళ్లకుండా సొంత ఊళ్లో ఏ మేరకు ఆస్తి ఉంది? ఎన్ని ఎకరాల భూమి ఉంది? హైదరాబాద్‌లో సొంత ఫ్లాట్, ఇల్లు వంటివి ఉన్నాయా? ఉన్న ఊళ్లో సదరు కుటుంబానికి ఎలాంటి గౌరవ మర్యాదలు ఉన్నాయి? వంటి అంశాలను ఆరా తీసి సంబంధాలను ఎంపిక చేసుకుంటున్నారు. ‘అమెరికా అబ్బాయిల కోసం ఎదురుచూసేందుకు అమ్మాయిలు నిరాకరిస్తున్నారు. చాలామంది ఇప్పుడు డిగ్రీ చేసిన వాడైనా సరే కుటుంబ భద్రత బాగుంటే చాలని భావిస్తున్నారు’అని హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ వివాహ పరిచయవేదిక ప్రతినిధి ఒకరు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement