
చరిత్రకు సజీవ సాక్ష్యం
ఆదరణలేక శిథిలమవుతున్న శిల్పకళా సంపద
పట్టించుకోని ప్రభుత్వం
తాళ్లగడ్డ (సూర్యాపేట): పిల్లలమర్రి ఆ పేరు వింటే నే చారిత్రక కట్టడాలు గుర్తుకువస్తాయి. ఆధ్యాత్మిక భావం ఉప్పొంగుతుంది. ఇక్కడ కాకతీయుల కాలంలో నిర్మించిన నామేశ్వర, ఎరకేశ్వర దేవాలయాలు దశాబ్దాలు దాటినా నేటికీ శిల్పకళా సంపద చరిత్రకు సజీవసాక్ష్యంగా నిలిచాయి. గొప్ప కళాకృతుల సౌందర్యం ఉట్టిపడే ఈ ఆలయాలకు నేడు ఆదరణ కరువైంది. పాలకులు పట్టించుకోకపోవడంతో భావితరాలకు అందించాల్సిన ఆధ్యాతి్మక సంపదకు రక్షణ లేకుండాపోయింది. ప్రభుత్వం చొరవ చూపి ఆలయ అభివృద్ధికి పాటుపడాలని భక్తులు కోరుతున్నారు.
నామేశ్వర ఆలయ నిర్మాణ వృత్తాంతం
కాకతీయ రాజు గణపతిదేవుడి పరిపాలనా కాలంలో రేచర్ల నామిరెడ్డి ప్రస్తుతం పిల్లలమర్రి గ్రామం ఉన్న ప్రాంతానికి సామంతరాజుగా ఉండేవారు. వీరు శైవారాధికులు కావడంతో 11వ శతాబ్దంలో మూసీ నది పరీవాహక ప్రాంతంలో ఆయన పేరు మీద పార్వతీ మహాదేవ నామేశ్వర దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడి శివలింగాలు బ్రహ్మసూత్రం కలిగి ఉండటం విశేషం. కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయాలకు మాత్రమే ఈ బ్రహ్మసూత్రం ఉంటుంది.
ఎరకేశ్వర ఆలయ వృత్తాంతం
12వ శతాబ్దంలో రేచర్ల బేతిరెడ్డి నామేశ్వర ఆలయంలో పూజలు చేసి పరిసర ప్రాంతంలో సంచరిస్తుండగా.. వేటకు వచ్చిన ఎరుకల వ్యక్తి అక్కడ ఉన్న ఒకపెద్ద ఊడల మర్రిచెట్టు కింద సేద తీరుతున్నాడు. ఆ సమయంలో ఆ చెట్టు పైన ఉన్న పిట్టలు.. మరి కొన్నాళ్లకు ఈ చెట్టు కూలుతుందని దీని కింద అనంత నిధి నిక్షిప్తమై ఉందని మాట్లాడుకోవడాన్ని విన్నాడు. వీరు అడవిలో ఉండటం పక్షులతో సావాసం కారణంగా ఆ మాటలు ఎరుకల వ్యక్తికి అర్థంకావడంతో వేటగాడు స్పందించాడు. దీంతో ఆ పక్షులు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే తల పగిలి చస్తావ్ అని శపిస్తాయి.
ఇది గమనించిన బేతిరెడ్డి రాజు ఎరుకల వారిని విషయం చెప్పాల్సిందిగా కోరగా శాప భయంతో వేటగాడు సంకోచిస్తుండగా చెప్పకుంటే మరణ శిక్ష విధిస్తానన్నాడు. చెప్పినా చెప్పకపోయినా ప్రాణం పోతుందని భావించిన వేటగాడు రాజును ఓ కోరిక కోరతాడు. తన పేరున ఆలయం నిర్మిస్తే పక్షులు మాట్లాడుకున్న విషయం చెబుతానని రాజుతో అంటాడు. అప్పుడు రాజు అందుకు అంగీకరిస్తాడు. దీంతో పక్షులు ఏం మాట్లాడుకున్నాయో రాజుకు వివరించి ఆ ఎరుకలివాడు మరణిస్తాడు. కొంతకాలానికి ఆ మర్రి చెట్టు కూలి అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడింది.
అందులో 7 కొప్పెర్ల నిధి (ఆనాటి కొలతల ప్రకారం) బయటపడుతుంది. ఆ ధనంతో ఎరకేశ్వర ఆలయం నిర్మించారు. దానికి ఎరుకల వాని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే దీనికి మరో వృత్తాంతం కూడా ప్రచారంలో ఉంది. రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరకసానమ్మ ఆలయం నిర్మించిందని ఆమె పేరు మీద ఎరకేశ్వరాలయం పేరు వచి్చందని కొందరి విశ్వాసం. ఆలయ నిర్మాణానికి ముందు ఇక్కడ ఉన్న పెద్ద మర్రిచెట్టు ఊడలు పోసుకొని పెద్దగా విస్తరించడంతో ఈ గ్రామానికి పిల్లలమర్రి అని పేరు వచ్చింది.
ఆలయ నిర్మాణ శైలి.. శిల్పకళా సౌందర్యం
నామేశ్వర ఆలయాన్ని చతురస్రాకారంలో, ఎరకేశ్వరాలయాన్ని శ్రీచక్రం ఆకారంలో రాతితో నిర్మించారు. ఇవి కాకతీయుల కాలం నాటి సంస్కృతిని, శిల్పసంపదను ప్రతిబింబిస్తున్నాయి. గర్భాలయం, అంతరాలయం తోరణాలు నల్లని (క్రిష్ణశిల) ఏకశిలతో నిర్మించడం విశేషం. ఈ ఆలయాల్లో శివలింగం ఎదురుగా నందీశ్వరుడు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎక్కడా లేని విధంగా నందిని ఆలయంపైన గోపురం ముందు ప్రతిష్టించారు.
రేచర్ల రాజులు నాట్య కళాప్రియులు కావడంతో ఆలయాల్లో గర్భగుడి ఎదురుగా నందీశ్వరునికి బదులుగా నాట్యమండపం నిర్మించారు. నాట్యమండపం నిర్మాణానికి ఏర్పాటు చేసిన స్తంభాలపై చెక్కిన నాట్య శిల్పకళా రూపాలు సౌందర్యవంతంగా దర్శనమిస్తున్నాయి. ఈ స్తంభాల నుంచి సప్తస్వరాలు వినిపించేలా నిర్మించడం విశేషం.
బ్రహ్మసూత్రంతో శివలింగం
సాధారణంగా అన్ని శివలింగాల మీద గీత ఉండదు కేవలం కాకతీయుల కాలంలో నిర్మించిన కొన్ని శివలింగాలకు మాత్రమే బ్రహ్మసూత్రం అనే గీత ఉంటుంది. బ్రహ్మసూత్రం ఉన్న ఆలయంలో ఒక్కసారి రుద్రాభిõÙకం, జపం, ఇత్యాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే కోటి సార్లు చేసిన పుణ్యఫలం లభిస్తుందని, ఇలాంటి శివలింగాన్ని దర్శిస్తే జన్మ ధన్యమవుతుందని భక్తుల నమ్మకం.
ధ్వంసమైన కళారూపాలు
వందల ఏళ్ల కిందట వచ్చిన అతిపెద్ద భూకంపం వల్ల శివలింగాలు ఉత్తరం వైపుగా ఒరిగాయి. ఆలయాలు కదలడంలో ఆలయ ప్రాకారాలు పైకప్పు జరిగిన ఆనవాళ్లు నేటికీ కనిపిస్తున్నాయి. నామేశ్వరాలయం నుంచి సూర్యాపేట బర్లపెంట బజార్‌లోని శ్రీఅన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి దేవాలయం వరకు సొరంగ మార్గం ఉంది. భూకంపం ప్రభావంతో కాలక్రమేణా పూర్తిగా పూడిపోయింది. పిల్లలమర్రి గ్రామంలో ఉన్న విఘ్నేశ్వరాలయం కాలగర్భంలో కలిసిపోయింది.
ఏటా శివరాత్రికి జాతర
శివరాత్రి ఉత్సవాల సందర్భంగా పిల్లలమర్రిలో 5 రోజుల జాతర.. శివరాత్రికి ఒకరోజు ముందు ప్రారంభం అవుతుంది. మొదటి రోజు గణపతి పూజతో మొదలుకొని రెండోరోజు శివరాత్రి లింగోద్భవకాలంలో కల్యాణం, మూడోరోజు ర«థోత్సవం, నాలుగవరోజు అగి్నగుండాలు, చివరి రోజున సాయంత్రం త్రిశూల స్నానం, ఏకాంత సేవ నిర్వహణతో జాతర ముగుస్తుంది.
భారీగా భక్తుల రాక
సూర్యాపేటకు ఆనుకుని ఉండటం, విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారికి చేరువలో ఉండటంతో జాతర సమయంలో భక్తులు అ«ధిక సంఖ్యలో వస్తుంటారు. చుట్టుపక్కల జిల్లాలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా భక్తులు రావటం విశేషం.
పట్టించుకోని ప్రభుత్వం
ఈ ఆలయాలకు ఆదరణ కరువైంది. వర్షాకాలంలో నీళ్లు కారుతూ పాకురుపట్టింది. శిథిలావస్థకు చేరువలో ఉంది. ఆదాయం తక్కువగా ఉందని ఆర్థిక మిగులు బాటు లేదని ప్రభుత్వం దేవాదాయశాఖ పట్టించుకోకపోవడం శోచనీయం.
ఆలయ ప్రాంగణంలో మంచినీటి బావులు..
ఇక్కడ మంచినీటి బావులకు ప్రత్యేక స్థానం ఉంది. 11వ శతాబ్దంలో రేచర్ల రాజులు బావులు తవ్వించారు. నాటి నుంచి నేటి వరకు అదే నీటితో అభిషేకాలు చేస్తున్నారు. కరువులోనూ ఈ బావులు ఎండకపోగా.. గ్రామస్తులు, రైతులు ఈ నీటిని తోడినా మళ్లీ అదే స్థాయిలోకి నీరు ఉండటం విశేషం. కరువు కాలంలో పక్కన ఉన్న మూసీ నది, చెరువులు అడుగంటినా ఈ బావి నీటిమట్టం తగ్గకపోవటం విశేషం.
త్రికూటేశ్వరాలయం..
త్రికూటేశ్వరాలయం, సరస్వతీదేవి సమేత బ్రహ్మ దేవాలయాలను రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరకసానమ్మ నామేశ్వర దేవాలయం ప్రాంగణంలోనే నిర్మించారు. త్రికుటేశ్వరాలయంలో మూడు శివలింగాలు ఒకే నందీశ్వరునితో ప్రతిష్టించారు. ఇక్కడి నంది ఉత్తరం వైపుగా తలతిప్పి ఉంటుంది.
ఎడమ కన్నుతో దక్షిణ, పడమర ఆలయంవైపు కుడి కన్నుతో ఉత్తరం వైపు ఉన్న ఆలయాన్ని చూస్తున్నట్లుగా ఉంటుంది. అన్ని శివాలయాలలో ప్రాణమట్టాలు ఉత్తరంవైపుగా ఉంటాయి. కానీ ఈ త్రికుటేశ్వరాలయంలో మాత్రం ఎదురుగా ఉన్న ఆలయంలో ఉత్తరం వైపు, ఉత్తరం, దక్షిణం వైపు ఉన్న ఆలయాల్లో మాత్రం తూర్పువైపుగా ప్రాణమట్టాలు ఉన్నాయి.
ప్రపంచంలోఈ విగ్రహం ఒక్కటే..
సరస్వతీదేవి సమేత బ్రహ్మ ఆలయంలో నెమలి వాహనంపై బ్రహ్మ సరస్వతీదేవి ఏకశిలపై ఒకే విగ్రహంగా దర్శనమిస్తారు. ప్రపంచంలో ఇలాంటి విగ్రహం ఇది ఒక్కటి మాత్రమే ఉండటం విశేషం. కవి పిల్లలమర్రి పినవీరభద్రుడు అమ్మవారిని దర్శించి కటాక్షం పొంది కవిగా ప్రసిద్ధి చెందాడని నానుడి. పిల్లలమర్రి గ్రామంలో పురాతన శ్రీచెన్నకేశవస్వామి ఆలయం, హనుమ ఆలయాలు కూడా ఉన్నాయి.
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి
పిల్లల మర్రి ఆలయాలకు 12 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిపై వచ్చే ధనాన్ని వెచ్చించి ధూపదీప నైవేద్యం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విజయవాడ–హైదరాబాద్ రహదారికి ఖమ్మం బైపాస్‌కి పిల్లలమర్రి గ్రామం మీదుగా లింక్ రోడ్డు వేస్తే భక్తుల రాకపోకలకు, ఆలయాభివృద్ధికి దోహదపడుతుంది. భక్తుల కోసం వసతి గృహాలు కట్టిస్తే బాగుంటుంది. వర్షాకాలంలో నీరు కారి ఆలయ పైకప్పు ప్రాకారాలు పాకురు పడుతున్నాయి. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి. – మునగలేటి సంతోష్ శర్మ, ప్రధాన అర్చకుడు