
అనుబంధం
‘ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే...భలే ఛాన్సులే’ అంటుంది సుపరిచిత సినిమా పాట. ‘మజా’ సంగతి ఎలా ఉన్నా ‘ఇల్లరికం అల్లుడు’ అంటే మజాకా కాదు. అత్తామామలను కన్నతల్లిదండ్రుల్లా చూసుకునే మంచి మనసు ఉండాలి. ఈ విషయంలో నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నారు మద్నూర్ మండల ఇల్లరికం అల్లుళ్లు...
మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో గల్లీకో నలుగురు ఇల్లరికం అల్లుళ్లు ఉంటారు. అందులో రెండు మూడు తరాల వాళ్లున్నారు. ఒకటి రెండు కుటుంబాల్లో మామ, అల్లుడు ఇద్దరూ ఇల్లరికం వాళ్లే ఉన్నారు. ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్న కుటుంబాల వాళ్లు తమ బంధువుల అబ్బాయిలను, తెలిసిన వాళ్ల అబ్బాయిలను, బంధుత్వం లేని వాళ్లను కూడా ఇల్లరికం తెచ్చుకుని వారికి తమ కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తారు.
అత్తగారి ఇల్లే....అమ్మగారి ఇల్లు
ఇల్లరికం వచ్చిన అల్లుల్లు అత్తారింటిలో భాగం అయిపోతారు. ఇక్కడి ఇంటి పేరే వారి ఇంటి పేరుగా మారిపోతుంది. సంతానం లేని కుటుంబాల్లో దగ్గరి బంధువుల అమ్మాయిని దత్తత తీసుకుని, వేరే అబ్బాయిని ఇల్లరికం తెచ్చుకుని పెళ్లిచేసి ఇంట్లో పెట్టుకుంటారు. ఇల్లరికం వచ్చిన అల్లుళ్లు అన్నీ తామై కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
అల్లుడే కుమారుడై...
మగ సంతానం లేకపోవడంతో ఇల్లరికం అల్లుడిని తెచ్చుకునే పద్ధతిని చాలామంది పాటిస్తున్నారు. కుటుంబ బరువు, బాధ్యతలు మోయడంతో పాటు, వృద్ధాప్యంలో అత్తామామలకు ఆసరాగా ఉంటున్నారు అల్లుళ్లు. దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది.
మంచిగ చూసుకుంటరు...
తాడిచెట్లవార్ సచిన్ సొంతూరు మహారాష్ట్రలోని సావర్మల్. అత్తమామలు తాడిచెట్ల అంజయ్య, రుక్మిణిలకు మగసంతానం లేరు. 2021లో సచిన్‌ను ఇల్లరికం తెచ్చుకున్నారు. ‘మా అత్తామామలకు కొడుకు, అల్లుడు అన్నీ నేనే. వ్యాపారం చూసుకుంటాను. ఇంటి వ్యవహారాలన్నీ నేను చూస్తాను. అందరం చాలా బాగా ఉంటాం’ అంటున్నాడు సచిన్.
‘మాది మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా. మా అత్తమామలకు ఒకతే ఆడపిల్ల కావడంతో 2022లో నన్ను ఇల్లరికం అల్లుడిగా తీసుకుని పెళ్లి జరిపించారు. ఇంట్లో అందరూ మంచిగ చూసుకుంటరు. నేను బిజినెస్ చేస్తున్నాను. ఇంట్లో అందరి సహకారం బాగుంది. ఎవరూ తేడా చూపరు’ అంటున్నాడు కన్నవార్ మణికంఠ.
‘2003 లో నేను ఇల్లరికం వచ్చాను. అల్లుడినైనా కొడుకులాగా మా అత్తామామలను చూసుకోవాలి. ఏ ఇబ్బందీ లేకుండా సంతోషంగా ఉన్నాం’ అంటున్నాడు గంపల్‌వార్ నాగనాథ్.
‘నాకు ముగ్గురు పిల్లలు. వాళ్లను బాగా చదివిస్తున్నాను. మా అత్తమామ నన్ను కొడుకులా చూసుకుంటారు. నాకు వాళ్లే తల్లిదండ్రులు’ అంటున్నాడు గడ్డంవార్ మల్లికార్జున్. ఇవన్నీ చూస్తుంటే మనం మొదట్లో పాడుకున్న పాటకు తగ్గట్టే ఉన్నారు అనిపిస్తోంది కదా!
మామ... అల్లుడు ఇద్దరూ ఇల్లరికమే...
మద్నూర్‌లో గడ్డంవార్ నడిపి గంగారాం 1966లో ఆ ఇంటికి ఇల్లరికం వచ్చాడు. ఆయనే ఆ ఇంటికి కొడుకైనా, అల్లుడైనా. ఆయనకు నలుగురు ఆడపిల్లలు. ముగ్గురు పెళ్లిళ్లు చేసిన తరువాత నాలుగో కూతురికి ఇల్లరికం అల్లుడిని తెచ్చుకోవాలనుకున్నారు. 2000 సంవత్సరంలో మల్లికార్జున్‌ను ఇల్లరికం తెచ్చుకుని నాలుగో కూతురితో పెళ్లి జరిపించాడు. అప్పటి నుంచి ఇంటి బాధ్యతలు మళ్లికార్జున్ చూసుకుంటున్నాడు.
అల్లుళ్ల సంఘం!
మద్నూర్ మండల కేంద్రంలో ఇల్లరికం అల్లుళ్లు కలిసి ఒక సంఘం పెట్టుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఊళ్లో ఇల్లరికం అల్లుళ్ల పేర్లతో జాబితాను రూపొందించుకున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి వంటి పదవులకు కూడా పేర్లు నిర్ణయించుకున్నారు. ఎందుకోగానీ సంఘం పెట్టుకోవాలనే వారి కల కలగానే మిగిలిపోయింది.
చిన్న చూపు చూడలేదు... చిన్న సమస్యా రాలేదు
మా ఆయన ఇల్లరికం వచ్చిండు. మాకు అందరు బిడ్డలే. మేమూ అల్లున్ని ఇల్లరికం తెచ్చుకున్నం. ఎప్పుడు గూడా చిన్న సమస్య రాలేదు. అందరం మంచిగనే ఉంటం. ఇల్లరికం అని ఎవరినీ ఎవరూ చిన్న చూపు చూడలేదు. కలిసి మెలిసి ఉండి ఎవరి పని వాళ్లు చేసుకుంటుంటరు.
– గడ్డంవార్ చంద్రకళ
– ఎస్. వేణుగోపాలాచారి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి