జూలై 13, గురువారం. బ్యాంకాక్‌లో ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్ పోటీ.
ట్రాక్ మీద జ్యోతి యర్రాజీ చిరుతలా సిద్ధంగా ఉంది. కాని ఆ రోజు వాతావరణం ఆమె పక్షాన లేదు. వాన పడటం వల్ల ట్రాక్ తడిగా ఉంది. 100 మీటర్ల హర్డిల్స్‌ను జాతీయ స్థాయిలో 12.82 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సాధించి ఉంది జ్యోతి. ఇప్పుడు అంతకన్నా తక్కువ సమయంలో పూర్తి చేస్తే మరో రికార్డు స్థాపించవచ్చు. పోటీ మొదలైంది. అందరూ వాయువేగంతో కదిలారు. వింటి నుంచి సంధించిన బాణంలా జ్యోతి దూసుకుపోతోంది. హర్డిల్స్ మీదుగా లంఘిస్తూ గాలిలో పక్షిలా సాగుతోంది. కాని 6వ హర్డిల్‌కు వచ్చేసరికి తడి వల్ల కొద్దిగా రిథమ్ తప్పింది.
వెంటనే సర్దుకుని పోటీని 13.09 సెకన్లలో పూర్తి చేసి మొదటిస్థానంలో నిలిచింది. 50 ఏళ్లుగా సాగుతున్న ఆసియా అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో తొలి స్వర్ణపతకం సాధించిన ఘనమైన రికార్డు ఇప్పుడు జ్యోతి వశమైంది. బుడాపెస్ట్‌లో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఎంపికైంది. అక్కడ ప్రతిభ చూపి ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావడం కోసం ఇదే 100 మీటర్ల హర్డిల్స్‌ను 12.77 సెకన్లలో పూర్తి చేయగలిగితే చాలు ఆ పోటీల్లో పాల్గొని ఒలింపిక్స్ విజేతగా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. అందుకే క్రీడాభిమానులు ఆమెపై ఆశలు పెట్టుకున్నారు. ఆమెను హర్షధ్వానాలతో ప్రోత్సహిస్తున్నారు.
సెక్యూరిటీ గార్డు కూతురు
జ్యోతి యర్రాజీ విశాఖ పోర్ట్ స్కూల్‌లో చదువుకుంది. ఆటలు తెలిసిన కుటుంబం కాదు. తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డ్. తల్లి ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఆయాగా పని చేసేది. వారిరువురికీ కుమార్తెను చదివించడమే ఎక్కువ. స్పోర్ట్స్‌లో ప్రవేశపెట్టడం కష్టం. కాని జ్యోతి డ్రిల్ పీరియడ్‌లో తోటి పిల్లలతో పరుగెత్తేది. పాఠశాలకు చేరువలోనే విశాఖ పోర్ట్ స్టేడియం ఉండటంతో అక్కడ సీనియర్ అథ్లెట్ల ప్రాక్టీస్‌ను పరిశీలించడం దినచర్యగా చేసుకుంది.తొలుత సబ్ జూనియర్ స్థాయిలో అంతర పాఠశాలల అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొనేది.
2015 రాష్ట్రస్థాయి పోటీల్లో పసిడి పతకం సాధించడంతో తోటి అథ్లెట్ల సలహాతో హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ హాస్టల్‌లో కోచ్ రమేష్ వద్ద శిక్షణ పొందింది. ఆమె ఆర్థిక స్థితి చూసి ఊరు వెళ్లాలంటే రమేషే డబ్బు ఇచ్చేవారు. అలాగే ఆమె సీనియర్ కర్నాటపు సౌజన్య (అప్పట్లో సికింద్రాబాద్–లింగంపల్లి రూట్ టి.సిగా పని చేసేది) కూడా ఆర్థికంగా సాయం చేసేది. జూనియర్ స్థాయి వరకే అక్కడ సదుపాయం ఉండటంతో సీనియర్స్ స్థాయిలో గుంటూరులోని అథ్లెటిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీకి వచ్చింది. విదేశీ కోచ్‌ల ప్రోత్సాహం దక్కడంతో నేషనల్స్ మెడల్ సాధించగలిగినా సెంటర్ కొనసాగకపోవడంతో అన్వేషణ తిరిగి మొదలైంది.
మలుపుతిప్పిన భువనేశ్వర్
అయితే జ్యోతి ప్రతిభ జాతీయ స్థాయిలో తెలియడం వల్ల 2019లో రిలయన్స్ ఆధ్వర్యంలో ఒడిశాలోని భువనేశ్వర్‌లో నడిచే అథ్లెటిక్స్ హై–పెర్ఫార్మెన్స్ సెంటర్ నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. 5.9 అడుగుల ఎత్తు, పొడుగు కాళ్లు ఉన్న జ్యోతికి వంద మీటర్ల పరుగుతో పాటు హర్డిల్స్‌లో కూడా శిక్షణనివ్వడం మొదలు పెట్టాడు ఇంగ్లండ్ నుంచి వచ్చిన కోచ్ జేమ్స్ హిల్లర్. దాంతో కర్ణాటకలో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్–యూనివర్శిటీ అథ్లెటిక్స్ మీట్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌ను 13.03 సెకన్లతో పూర్తి చేసి స్వర్ణం గెలుచుకుంది జ్యోతి.
2020 ఫిబ్రవరిలో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో మరో స్వర్ణం వచ్చింది. 2022 సెప్టెంబర్‌లో గుజరాత్‌లో జరిగిన జాతీయ పోటీల్లో 12.79 సెకన్లతో రికార్డు స్థాపించింది. ఇప్పుడు బ్యాంకాక్ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ‘ఫాస్టెస్ట్ ఆసియన్ ఉమెన్ ఇన్ హండ్రెడ్ మీటర్స్ హర్డిల్స్’ రికార్డు స్థాపించింది. ఆమెకు జాతీయ క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ అభినందనలు తెలియచేశారు.
– డాక్టర్ మాడిమి సూర్యప్రకాశరావు, సాక్షి విశాఖ స్పోర్ట్స్
Comments
Please login to add a commentAdd a comment