సాక్షి, మద్నూర్(నిజామాబాద్): వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని హత్య చేసి హతుడు తవ్విన గుంతలోనే పూడ్చి పెట్టారు. మండలంలోని పెద్ద ఎక్లారలో ఫిరంగి సాయిలు(35) అనే వ్యక్తిని డిసెంబర్‌లో అంతమొందించిన విషయం తెలిసిందే. డీఎస్పీ జైపాల్‌రెడ్డి, ఎస్సై శివకుమార్ మృతదేహాన్ని పూడ్చి పెట్టిన స్థలాన్ని సోమవారం పరిశీలించారు. కూలీలతో మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. బిచ్కుంద మండలం కందర్‌పల్లికి చెందిన సాయిలుకు, పెద్ద ఎక్లారకు చెందిన రుక్మిణితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. రుక్మిణి తల్లి, తండ్రి మృతి చెందడంతో సాయిలు తన భార్యతో కలిసి అత్తగారి ఇంటి వద్దే ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. అయితే రుక్మిణికి అదే గ్రామానికి చెందిన మొగులాజీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని సాయిలు హత్య చేయాలని రుక్మిణి, మొగులాజీ భావించారు.
గుంత తవ్వాలని కూలీకి పిలిచి..
సాయిలు హత్యకు పథకం వేసిన మొగులాజీ తన పొలంలో గుంత తవ్వాలని డిసెంబర్ 25న కూలీకి పిలిచాడు. పొలానికి వచ్చేటప్పుడు దొడ్డు ఉప్పు సంచులు తేవాలని చెప్పాడు. దీంతో సాయిలు ఉప్పు సంచులు తీసుకొని వెళ్లాడు. పొలంలో కరెంట్ స్తంభం కోసం అని చెప్పి సాయిలు చేత గుంత తవ్వించారు. గుంత తవ్విన అనంతరం సాయిలు మొగులాజీ, అదే గ్రామానికి చెందిన విఠల్ కలిసి అక్కడే మద్యం తాగారు. అనంతరం విఠల్, మొగులాజీ సాయిలును హత్య చేసి ఆ గుంతలో పాతిపెట్టారు. మృతదేహం వాసన రాకుండా సాయిలు తెచ్చిన ఉప్పును శవంపై చల్లి పూడ్చిపెట్టారు. ఎవరికి అనుమానం రాకుండా ఎవరి ఇంటికి వారు వెళ్లి పోయారు.
చదవండి: జీడిమెట్లలో బాలిక అనుమానాస్పద మృతి
ఇలా బయట పడింది..
సాయిలు గ్రామంలో ఎవరికి ఎక్కువగా పరిచయం లేకపోవడంతో సాయిలు గురించి ఆరా తీయలేదు. దీంతో ఆయన చనిపోయిన విషయం బయట పడలేదు. అయితే నిందితులు మొగులాజీ, విఠల్ మధ్య నాలుగు రోజుల క్రితం గొడవ జరిగింది. విఠల్ మద్యం తాగడానికి మొగులాజీని డబ్బులు అడగ్గా.. ఇవ్వలేదు. దీంతో ఆవేశంలో విఠల్ హత్య విషయం బయట పెట్టాడు. కాగా నిందితుల్లో ఒకరైన విఠల్ వరుసకు రుక్మిణికి తమ్ముడు అవుతాడు. సాయిలు ను ఎలా చంపారో పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్సై పేర్కొన్నారు. రుక్మిణి, మొగులాజీ, విఠల్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment