
వడదెబ్బ, డీహైడ్రేషన్ బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలంటున్న వైద్యులు
తగినన్ని మంచినీళ్లతోపాటు ఓఆర్‌ఎస్, కొబ్బరినీరు వంటి పానీయాలు తాగాలని సూచన
అత్యవసరమైతే తప్ప ఉదయం, మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లొద్దని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు గత కొన్ని రోజులుగా ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40–42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. మే నాటికి 46–48 డిగ్రీల వరకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా సింగరేణి కాలరీస్‌తోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వేసవికి అనుగుణంగా నడుచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వేసవి తీవ్రత..
తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనుల సమీపంలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల వడగాడ్పులు తీవ్రతరం అవుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో సింగరేణి కార్మికులతోపాటు రోజువారీ కూలీలు, రైతులు, చిరువ్యాపారులు, నిర్మాణరంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరగడం వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ ఉందని వైద్యులు చెబుతున్నారు.
అప్రమత్తత అవసరం
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరైతే గొడుగు, టోపీ, సన్‌్రస్కీన్ లేదా తడి గుడ్డ ఉపయోగించడం ద్వారా ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందాలని చెబుతున్నారు. టూవీలర్లపై వెళ్లే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వదులైన, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలంటున్నారు.
డీహైడ్రేషన్‌కు గురికాకుండా ...
వేసవిలో తాగిన నీరు తాగినట్టే చెమట రూపంలో వెళ్లిçపోతుంది. రోజుకు 3–4 లీటర్ల నీరు తాగడం శ్రేయస్కరం. దాహం లేకపోయినా గంటకోసారి నీటిని తాగుతూ ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చెమట ఎక్కువగా పట్టినప్పుడు ఓఆర్‌ఎస్, ఉప్పు–చక్కెర కలిపిన నీరు తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. కూల్‌డ్రింక్స్, బీర్లు, చికెన్, మాంసం తినడం వేసవిలో వేడిని ఇంకా పెంచుతాయి. రోజుకు 2–3 సార్లు కొబ్బరినీరు తాగితే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతౌల్యంగా ఉంటాయి. కాఫీ, టీ, ఆల్కహాల్ శరీరంలో నీటిని తగ్గిస్తాయి కాబట్టి వాటి బదులు హెర్బల్ టీ, తాజా పండ్ల రసాలు తాగడం మేలు.
ఆహారం ముఖ్యం
తేలికైన, నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజ్, కీర దోస వంటివి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అధిక ఉప్పు, కారం, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. బదులుగా ఉడకబెట్టిన ఆహారం, సూప్‌లు, సలాడ్‌లు తీసుకోవాలి. గుండె జబ్బులు, మధుమేహం ఉన్న వాళ్లు నీటిని అధికంగా సేవిస్తూ ఎండల్లో తిరగడం తగ్గించాల్సి ఉంటుంది.
జాగ్రత్తలతోనే వేసవి నుంచి రక్షణ
వేసవిలో శరీరంలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీర ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలు దాటినప్పుడు మెదడు వ్యాధులు, అవయవ వైఫల్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను శరీరం బ్యాలెన్స్ చేసుకొనేలా వ్యవహరించాలి. ఆహార నియమాలు పాటించాలి. అధిక ఎక్సర్‌సైజ్‌లు తగ్గించాలి. – డాక్టర్ కిరణ్ మాదాల, ప్రొఫెసర్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్, ఉస్మానియా కళాశాల