
కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల డైరెక్ట్ నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదివారం విడుదల చేశారు. గతంలో తీసుకొచ్చిన గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. 12 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 2,500కు పైగా బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నియామకాలను ఎలా చేపట్టాలనే దానిపై కొన్ని నెలల క్రితం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ సిఫార్సు చేసిన మార్గదర్శకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యూజీ, పీజీతో పాటు సాంకేతిక, ఫిజికల్ ఎడ్యుకేషన్ బోధించే అధ్యాపకుల నియామకానికి రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. నియామక ప్రక్రియలో మూడు దశలను అనుసరిస్తారు. ప్రతీ యూనివర్సిటీలోనూ కమిటీ ఏర్పాటు చేసి, రోస్టర్ విధానం, రిజర్వేషన్ విధానానికి సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేస్తారు. దీనికి విశ్వవిద్యాలయం వీసీ నాయకత్వం వహించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం ఆమోదించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..
అకడమిక్ రికార్డ్, పరిశోధనలకు సంబంధించి 50 మార్కులను కేటాయిస్తారు. యూనివర్సిటీ వీసీ, ఉన్నత విద్యా మండలి సబ్జెక్ట్ నిపుణుడు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, డిపార్ట్‌మెంట్ ముఖ్యుడు మార్కుల స్క్రూటినీ చేస్తారు. అభ్యర్థికి సంబంధించి యూజీ నుంచి రీసెర్చ్ వరకూ వివిధ విద్యా స్థాయిల్లో మార్కులను ఖరారు చేస్తారు. మొత్తం వంద మార్కుల్లో ఇంటర్వ్యూకు 20 మార్కులు, టీచింగ్ నైపుణ్యానికి 30 మార్కులు ఉంటాయి. మిగతా 50 మార్కులను యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ విభాగాల నుంచి అభ్యర్థి సాధించిన మార్కుల శాతం ఆధారంగా తీసుకుంటారు.
నాలెడ్జ్ అండ్ స్కిల్స్‌కు 30 మార్కులు ఇస్తారు. ఈ మార్కులను టీచింగ్, బుక్ ఆథర్‌షిప్, జాయింట్ ఆథర్ షిప్, ఎడిట్ ఆథర్‌షిప్, కో–ఎడిటర్ ఆథర్‌షిప్, పోస్టు–డాక్టోరల్ షిప్‌గా విడగొడతారు. ఈ మార్కులను ఆయా సబ్జెక్టు లెక్చరర్లు పరిశీలించి, నిర్ణయిస్తారు. ఇంటర్వ్యూకు 20 మార్కులు ఇస్తారు. ఇందులో సబ్జెక్టు ప్రజెంటేషన్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, ఓవరాల్ పర్సనాలిటీ, నైపుణ్యాన్ని బట్టి మార్కులు వేస్తారు.