● బైక్‌పై నేపాల్ వెళ్తూ ప్రమాదానికి గురైన దంపతులు
● సీహెచ్ అగ్రహారం వంతెనపై ప్రమాదం
● భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు
పూసపాటిరేగ: మితిమీరిన వేగం భార్య ప్రాణాలు తీయగా, భర్తను క్షతగాత్రుడిని చేసింది. బైక్‌పై నేపాల్ వెళ్తున్న రాజమండ్రికి చెందిన దంపంతులు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం సీహెచ్ అగ్రహారం ఫ్లై ఓవర్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... రాజమండ్రికి చెందిన నంబూరి నాగసత్య లక్ష్మి, భార్గవరాజు దంపతులు కోయంబత్తూర్‌లోని ఈషా యోగా కేంద్రంలో పనిచేస్తున్నారు. ఇటీవల సొంతూరు రాజమండ్రికి వచ్చారు. నేపాల్ పర్యటన కోసం ఉదయం 6 గంటలకు రాజమండ్రిలో బయలుదేరారు. 10.30 గంటలకు బైక్ అదుపుతప్పి సీహెచ్ అగ్రహారం ఫ్లై ఓవర్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో బైక్ వేగం అధికంగా ఉండడంతో వంద మీటర్ల వరకు ఇద్దరినీ ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో నాగసత్య లక్ష్మి అక్కడకక్కడే ప్రాణాలు విడవగా, భార్గవరాజుకు తీవ్రగాయాలయ్యాయి. ఆయ నను చికిత్స నిమిత్తం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. పూసపాటిరేగ ఎస్‌ఐ ఐ.దుర్గాప్రసాద్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నవసమాజ స్థాపకుడు పూలే
విజయనగరం టౌన్: నవ సమాజ స్థాపనకు బాటలు వేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొనియాడారు. పూలే జయంతిని కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ సమీపంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంపై చెరగని ముద్రవేసిన మహనీయుడు పూలే అని, 200 ఏళ్ల తర్వాత స్మరించుకోవడం పూలే గొప్పతనానికి నిదర్శనమన్నారు. ఆయన ఆలోచనలు, కృషి ఫలాలు నేటితరం అందుకుంటోందన్నారు. సీ్త్ర విద్యకోసం పాటుపడ్డారన్నా రు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే పూలే దంపతులకు నిజమైన నివాళి అని తెలిపారు. జిల్లా కేంద్రంలో పూలే భవన నిర్మాణానికి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని అందించేందుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర తూర్పుకాపు చైర్‌పర్సన్ పాలవలస యశస్విని, జేసీ సేతుమాధవన్ మాట్లాడారు. సుమారు 400 మంది బీసీలకు రుణాలు, ఉపకరణాలను పంపిణీ చేశారు. పూలే ఏకపాత్రాభినయం ప్రదర్శించిన కళాకారుడు ఆర్.బి.రామానాయుడును సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, జిల్లా బీసీ సంక్షేమాధికారిణి జ్యోతిశ్రీ, బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజీరావు, వివిధ బీసీ సంఘాల నాయకులు ముద్దాడ మధు, వె.శంకరరావు, విజయలక్ష్మి, రమేష్, కిల్లంపల్లి ఆచారి తదితరులు పాల్గొన్నారు.
73,620 మందికి ఆరోగ్యశ్రీ సేవలు
విజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ (ఎన్‌టీఆర్ వైద్య సేవ) పథకం కింద 2024 జనవరి నుంచి 2025 మార్చి వరకు జిల్లాలో 73,620 మందికి చికిత్స అందించినట్టు ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ దూబ రాంబాబు తెలిపారు. దీనికోసం రూ.143.24 కోట్లు అందించినట్టు తెలిపారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఆరోగ్యశ్రీ విభాగాన్ని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ముందుగా ఆరోగ్య మిత్రల హెల్ప్ డెస్క్‌ను తనిఖీచేశారు. ఆరోగ్యశ్రీ రోగుల రిజిస్ట్రేషన్ రికార్డులు, ఆరోగ్యశ్రీ వార్డును పరిశీలించారు. వైద్యసేవలపై ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలు ప్రతిరోజు భోజనాన్ని పరిశీలించి యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. రుచికరమైన భోజనం అందించకుంటే జిల్లా మేనేజర్, జిల్లా కో ఆర్డినేటర్ దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయన వెంట ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్ తుంపల్లి జనార్దనరావు, ఆరోగ్యమిత్ర శర్వాణి ఉన్నారు.