పడిపోతున్న భూగర్భ జలాలు | Sakshi
Sakshi News home page

పడిపోతున్న భూగర్భ జలాలు

Published Mon, May 6 2024 7:40 AM

పడిపో

● ఏప్రిల్‌లో 5.70 మీటర్లకు పడిపోయిన జలాలు ● ఒక్క నెలలోనే 0.30మీటర్లు పడిపోయిన వైనం

జగిత్యాలఅగ్రికల్చర్‌: భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో భూగర్భజలాలు దారుణంగా పడిపోతున్నాయి. ఏప్రిల్‌ నెలలోనే జిల్లాలో నీటి మట్టం 0.30మీటర్లు పడిపోవడంతో.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే మే నెలలో నీటి మట్టం మరెంతగా పడిపోయే అవకాశముందోననే ఆందోళన మొదలైంది. ఇప్పటికే పట్టణాల్లో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అందించే పరిస్థితి నెలకొంది.

మున్సిపాలిటీల్లో పెరుగుతున్న నీటి వినియోగం

జగిత్యాలతోపాటు కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీలున్నాయి. ఈ పట్టణ ప్రాంతాల్లో నీటి వినియోగం రోజురోజుకు పెరిగిపోయి భూగర్భ జలాలు లోతుకు పడిపోతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో గత నెలలో 7.42మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా.. నీటి మట్టం 0.27మీటర్లకు పడిపోయి ప్రస్తుతం 7.69మీటర్లకు చేరుకుంది. కోరుట్లలో గత నెలలో 9.37మీటర్లున్న నీటి మట్టం 1.07మీటర్లకు పడిపోయి ప్రస్తుతం 10.44మీటర్లకు చేరుకుంది. మెట్‌పల్లిలో గత నెలలో 5.08మీటర్ల లోతులో భూగర్భ జలం ఉండగా.. 0.15మీటర్లు పడిపోయి 5.23మీటర్లకు చేరుకుంది. రాయికల్‌ మున్సిపాలిటీలో గత నెలలో 3.08మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా.. 0.12మీటర్లు పడిపోయి ప్రస్తుతం 3.20మీటర్లకు చేరుకుంది. ధర్మపురి మున్సిపాలిటీలో గత నెలలో 7.51మీటర్ల లోతులో భూగర్భ జలముండగా.. ప్రస్తుతం 0.66మీటర్లు పడిపోయి 8.17 మీటర్లకు చేరుకుంది.

నాన్‌ ఆయకట్టు ప్రాంతాల్లో పడిపోతున్న నీటి మట్టం

జిల్లాలో నాన్‌ ఆయకట్టు ప్రాంతాలుగా ముద్రపడ్డ(సాగునీరందని) మల్యాల, మెడిపల్లి, కథలాపూర్‌, కొడిమ్యాల, మెట్‌పల్లి ప్రాంతాల్లో భూగర్భ జలాలు మరింతగా పడిపోతున్నాయి. నాన్‌ ఆయకట్టు ప్రాంతాల్లో పంటలకు సాగునీరును ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. మల్యాల మండలంలో గత నెలలో 6.67మీటర్ల లోతులో నీరుండగా.. నీటి మట్టం 0.25మీటర్లు పడిపోయి ప్రస్తుతం 6.92మీటర్లకు చేరుకుంది. కొడిమ్యాల మండలంలో గత నెలలో 10.70మీటర్లు ఉండగా.. 0.41మీటర్లు పడిపోయి ప్రస్తుతం 11.11మీటర్లకు భూగర్భ జలం చేరుకుంది. కథలాపూర్‌ మండలంలో 3.01మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం ప్రస్తుతం 0.75మీటర్లకు పడిపోయి 3.76మీటర్లుకు చేరుకుంది. మేడిపల్లి మండలంలో 3.23మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం 0.23మీటర్లు పడిపోయి ప్రస్తుతం 3.46మీటర్లకు చేరుకుంది.

ఒక్క నెలలోనే..

జిల్లాలో ఒక్క నెలలోనే నీటి మట్టం సగటున 0.30మీటర్లకు పడిపోయింది. మార్చి నెలలో 5.40మీటర్ల లోతులో నీరు ఉండగా.. ఏప్రిల్‌ నెల చివరి నాటికి 0.30మీటర్లు పడిపోయి ప్రస్తుతం 5.70మీటర్లకు చేరుకుంది. గతేడాది ఏప్రిల్‌ నెలతో పోల్చితే 0.44మీటర్లు తగ్గింది. జిల్లాలో ఏప్రిల్‌ చివరి నాటికి కథలాపూర్‌ మండలంలో అతి తక్కువగా 2.80మీటర్ల లోతులో నీరు ఉండగా.. అత్యధికంగా కొడిమ్యాల మండలంలో 11.11మీటర్ల లోతులో నీరు ఉండటం గమనార్హం.

రోజురోజుకూ తగ్గుతున్నాయి

భారీ ఉష్ణోగ్రతలతో భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతున్నాయి. వర్షాలు కురిస్తే గాని భూగర్భ జలాలు పెరిగే పరిస్థితి లేదు. ప్రస్తుతమున్న నీటిని పొదుపుగా వాడాల్సిన అవసరం నెలకొంది. మే నెలలో మరింతగా భూగర్భ జల నీటి మట్టం పడిపోనుంది.

– నర్సింహులు, జిల్లా భూగర్భజల

వనరుల శాఖాధికారి, జగిత్యాల

పడిపోతున్న భూగర్భ జలాలు
1/2

పడిపోతున్న భూగర్భ జలాలు

పడిపోతున్న భూగర్భ జలాలు
2/2

పడిపోతున్న భూగర్భ జలాలు

Advertisement
Advertisement