ఆయిల్‌పాం రైతులు జాగ్రత్తలు పాటించాలి | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పాం రైతులు జాగ్రత్తలు పాటించాలి

Published Sun, May 5 2024 1:35 AM

ఆయిల్‌పాం రైతులు జాగ్రత్తలు పాటించాలి

ఎర్రవల్లిచౌరస్తా: ఆయిల్‌ఫామ్‌ తోటలు సాగు చేస్తున్న రైతులు వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలని అలంపూర్‌ డివిజన్‌ హార్టికల్చర్‌ అధికారి రాజశేఖర్‌ అన్నారు. శనివారం ఎర్రవల్లి మండలంలోని కొండపేట గ్రామంలో రైతు సందీప్‌ ఆచారి సాగు చేసిన ఆయిల్‌ఫామ్‌ తోటను సందర్శించారు. సాగులో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై రైతులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా వేసిన ఆయిల్‌ఫామ్‌ తోటలతో పాటు ఎదిగిన మొక్కలను కాపాడుకుంటూ మంచి దిగుబడి సాధించేందుకు రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. మూడు సంవత్సరాలలోపు మొక్కలకు చుట్టూ మూడు అడుగుల దూరంలో జనుమును పచ్చిరొట్ట ఎరువుగా వేసుకోవాలన్నారు. పూత దశకు రాగానే చిన్న చిన్న ముక్కలుగా కోసి పాదులో వేయాలన్నారు. వేసవిలో చిన్న మొక్కకు 150–165 లీటర్లు, ఎదిగిన మొక్కలకు 250–330 లీటర్ల నీటిని ప్రతి రోజు అందించాలన్నారు. అంతర పంటలు సాగుచేస్తే సిఫారస్సు మేరకు నీటిని తప్పనిసరిగా అందించాలన్నారు. సిఫారసు పద్ధతిలో మాత్రమే పోషకాలను అందించాలన్నారు. గెలలు కోసిన తర్వాత నరికి ముక్కలు చేసిన ఆయిల్‌ఫామ్‌ ఆకులను, మగపూత గుత్తులను పాదుల్లో మల్చింగ్‌ వేయాలన్నారు. పక్వానికి వచ్చిన గెలలను కోయడానికి అల్యూమీనియం కడ్డీని లేదా కత్తిని ఉపయోగించి మాత్రమే కత్తిరించాలన్నారు. రైతులకు ఏమైనా సందేహాలుంటే స్థానిక అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్‌ అధికారి వెంకటేష్‌, వివిధ గ్రామాల రైతులు ఉన్నారు.

డివిజన్‌ హార్టికల్చర్‌ అధికారి రాజశేఖర్‌

Advertisement
 
Advertisement